Escorting: రిషిసునాక్‌ కాన్వాయ్‌ చుట్టూ జాగింగ్ చేస్తూ పోలీసుల ఎస్కార్టింగ్‌.. వెల్లువెత్తుతున్న విమర్శలు

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కాన్వాయ్‌ చుట్టూ పోలీసులు జాగింగ్, సైక్లింగ్‌ చేస్తూ ఎస్కార్టింగ్‌ నిర్వహించారు. దీంతో ప్రధాని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయనను ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌తో పోలుస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 Apr 2023 17:56 IST

లండన్‌: బ్రిటన్‌ (UK) ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లండన్‌లో ఆయన కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు ఆయన కాన్వాయ్‌ చుట్టూ జాగింగ్, సైక్లింగ్‌ చేస్తూ ఎస్కార్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దయచేసి దారి ఇవ్వండి అని అరుస్తూ పోలీసు అధికారులు ప్రజలను రోడ్లపై నుంచి చెదరగొడుతున్నట్లు వీడియోలో ఉంది. దీంతో ప్రధానిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వీడియా చూసిన యూజర్లు సునాక్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un)తో పోలుస్తున్నారు. గతంలో కిమ్‌ జోంగ్ కారు చుట్టూ అంగరక్షకులు ఈ విధంగానే జాగింగ్‌ చేశారు.

ప్రధాని తీరుపై సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్‌ కాలమిస్ట్‌ జెర్రీ హసన్‌ ‘‘రిషిసునాక్‌ అమెరికా మినీ ప్రెసిడెంట్‌లా లండన్ చుట్టూ తిరిగారు. భవిష్యత్తులో లేబర్‌ పార్టీ ప్రధాని ఎవరైనా ఇదే విధంగా ప్రవర్తిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘పట్టణంలోకి కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వచ్చాడా అని ఓ యూజర్‌ కామెంట్ చేయగా.. మరో యూజర్‌ పోలీసుల మానవవనరులను వృథా చేశారని ట్వీట్‌ చేశారు. 

ఎక్స్‌టింక్షన్‌ రెబిలియన్‌ నిరసనల (Extinction Rebellion) నేపథ్యంలో ఈ రక్షణ ఏర్పాట్లు చేశారా అని ప్రధాని అధికారిక ప్రతినిధిని ప్రశ్నించగా.. ‘‘భద్రతా సమస్యల దృష్ట్యా పోలీసులు ఏదైనా చేయాల్సి ఉంటుంది’’ అని సమాధానమిచ్చారు. ఎక్స్‌టింక్షన్‌ రెబెలియన్‌ అనే పర్యావరణ బృంద సభ్యులు ఇంధన వెలికితీత ప్రాజెక్టులను తక్షణం నిలిపివేయాలని లండన్‌లో నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనల నేపథ్యంలోనే ప్రధానికి భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని