Trump: నేను అధికారంలోకి రాగానే.. ఆ ‘బందీ’లను విడిపిస్తా: ట్రంప్‌

మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతాననే ధీమాతో ఉన్న ట్రంప్‌(Trump)..ఆ పదవి చేపట్టాక తీసుకునే చర్యల గురించి వెల్లడించారు. 

Published : 12 Mar 2024 11:09 IST

వాషింగ్టన్‌: 2021లో క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో భాగమై జైలుకెళ్లిన వారిని (US Capitol Rioters) విడిపిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అన్నారు. మరోసారి ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అదీ ఒకటని వెల్లడించారు. ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న వారిని బందీలు అని అభివర్ణించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘సరిహద్దులను మూసివేయడం, అన్యాయంగా జైల్లో ఉంచిన జనవరి 6 బందీలను విడిపించడం..మీ తదుపరి అధ్యక్షుడిగా నేను తీసుకునే తొలినిర్ణయాలు’ అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.  

2021 జనవరి 6న ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిటల్‌ భవనంపై భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సమావేశమైన వేళ.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు భవనంలోకి దూసుకెళ్లారు. ఆ ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. కానీ ట్రంప్‌ వాటిని తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే డెమోక్రాట్లు  తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఆరోజు దాడిలో పాల్గొన్నవారిని విడిపిస్తానని ట్రంప్‌ వెల్లడించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఈ తరహా వాగ్దానాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని