close
సంక్రాంతి తర్వాత స్థానికం

జనవరి 9నే అమ్మఒడి ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఓ సంస్కరణ
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
ఈనాడు - అమరావతి

సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పండగ అనంతరం ఎన్నికల ప్రకటన విడుదల చేయాలని, పురపాలక సంఘాల ఎన్నికలతో ప్రారంభించి ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ఎన్నికలూ పూర్తి చేయాలని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అమ్మ ఒడి పథకాన్ని ముందుగా అనుకున్నట్టు జనవరి 26న కాకుండా, ఆ నెల తొమ్మిదో తేదీనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టడం కేవలం ఒక కార్యక్రమం కాదని, అది ప్రభుత్వం చేపడుతున్న గొప్ప సంస్కరణ అని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ...‘‘మనం కూడా ఒకేసారి పదో తరగతి వరకు ప్రవేశపెట్టడం లేదుకదా? ఒకటి నుంచి ఆరో తరగతి వరకే మొదట అమలు చేస్తాం. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్కో తరగతికి విస్తరిస్తూ వెళతాం’’ అని వివరించారు. ‘‘ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం సరికాదని కొందరు మాట్లాడుతున్నారు. రామోజీరావు, వెంకయ్యనాయుడి కుమార్తె, తెదేపా ట్రస్ట్‌ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉన్నది ఆంగ్లమాధ్యమమే కదా’’ అని ఆ సందర్భంగా జగన్‌ వ్యాఖ్యానించారు. రూ.2.5 కోట్లకుపైగా ఆదాయం ఉన్న 8 దేవస్థానాల పాలక మండళ్లను ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకుని భర్తీ చేస్తుండగా.. ఇకపై నేరుగా తితిదే బోర్డు తరహాలో ప్రభుత్వమే నామినేట్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ‘దేవాలయాలు, మార్కెట్‌ కమిటీల పాలక మండళ్ల నియామకాలన్నీ ఈ నెలాఖరుకి పూర్తి కావాలి. దానికి ఇన్‌ఛార్జి మంత్రులదే పూర్తి బాధ్యత. ఆది, సోమవారం నాటికి మార్కెట్‌ కమిటీల రిజర్వేషన్లు నోటిఫై చేయాలి’ అని సీఎం స్పష్టంచేశారు.

రిజర్వేషన్ల ప్రకారం లేకపోతే తొలగింపు
వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రస్తుతం సేవలందిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలన్నిటినీ ఈ నెలాఖరుకి రద్దు చేసి, ప్రభుత్వానికి నివేదిక పంపాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశాలు రాలేదని పార్టీ కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారని, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనైనా వారికి అవకాశమివ్వాలని పలువురు మంత్రులు కోరారు. దానికి సీఎం స్పందిస్తూ...‘‘మీరెంతమందికి ఇవ్వగలరు? నలుగురికో, ఐదుగురికో ఇస్తే మిగతా వారిలో అసంతృప్తి వస్తుంది కదా? పైగా మీపైనే ఒత్తిడి పెరిగిపోతుంది. మొత్తం గందరగోళమవుతుంది. పారదర్శకంగా భర్తీ చేస్తే ఏ సమస్యా ఉండదు’’ అని సీఎం పేర్కొన్నట్టు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పుడు పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు...50 శాతం రిజర్వేషన్ల విధానం ప్రకారమే ఉన్నారో లేదో చూడాలని, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్‌ ఎక్కువ ఉంటే.. జూనియర్‌ అధికారుల నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకు సర్దుబాట్లు చేసే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించారు.

రాజకీయ అవినీతి తగ్గింది..కానీ, అధికారుల్లోనే..
మీ దెబ్బకు రాజకీయ అవినీతి 80 శాతం తగ్గిందని, అధికారుల్లో మాత్రం ఇంకా ఏ మార్పూ రాలేదని, అవినీతి అలాగే ఉందని మంత్రులు పేర్కొన్నారు. దానిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘‘వాళ్లపని వేరేవాళ్లు చూస్తారు. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.