Corona: అలక్ష్యమే శత్రువు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: అలక్ష్యమే శత్రువు

లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ముప్పు
సకాలంలో పరీక్షలు ఎంతో ముఖ్యం
సొంత వైద్యంతో అనవసర జాప్యం
జాగ్రత్తలు ముఖ్యమంటున్న నిపుణులు

కరోనా వస్తే ఇంట్లో ఉండి చికిత్స చేసుకుంటే సరిపోతుందా? వెంటనే ఆసుపత్రిలో చేరాలా? చేరాల్సి వస్తే ఎప్పుడు చేరాలి? ఇవన్నీ ఇప్పుడు సామాన్యులను వేధిస్తున్న ప్రశ్నలు. కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడి నయం చేసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కొందరు వైద్య నిపుణులూ గట్టిగా చెబుతున్నారు. మరో పక్క ‘ఆసుపత్రికి రావడంలో ఆలస్యం చేశారు. మా వద్దకు వచ్చేటప్పటికే వ్యాధి చాలా ముదిరింది. ముందే వచ్చుంటే ప్రాణాలు దక్కేవి’ అన్న మాటలూ కరోనా సెకండ్‌వేవ్‌లో తరచూ వింటున్నాం. ఇలాంటి పరస్పర విరుద్ధమైన భావనలు బాధితులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమేం చేయాలి?

కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడి నయం చేసుకోవచ్చు.

- వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కొందరు వైద్య నిపుణులూ గట్టిగా చెబుతున్న సలహా ఇది.


ఆసుపత్రికి రావడంలో ఆలస్యం చేశారు. మా వద్దకు వచ్చేటప్పటికే వ్యాధి చాలా ముదిరింది. ముందే వచ్చుంటే ప్రాణాలు దక్కేవి’

- బాధితుల పరిస్థితి చేయి దాటిన తరువాత వైద్యుల నుంచి తరుచుగా వినిపిస్తున్న వివరణ ఇది.

ఈ కరోనా సెకండ్‌వేవ్‌లో తరచూ ఇలాంటి పరస్పర విరుద్ధమైన భావనలు బాధితులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి? ఇంట్లోనే చికిత్స తీసుకుంటే ఏ జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? వంటి సందేహాలను విశాఖకు చెందిన సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ డా.వి.రామనరసింహం, విజయవాడలోని నాగార్జున ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌, కన్సల్టెంట్‌ అనస్థీషియాలజిస్ట్‌ డా.యు.శ్రీలక్ష్మి నివృత్తి చేశారు. వారి సలహాలివి.

జాప్యంతోనే ప్రమాదం
పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన పని లేదు. ప్రమాదమల్లా అశ్రద్ధతోనే. చాలామంది వ్యాధి లక్షణాలను సరిగా గుర్తించకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించకుండా జాప్యం చేస్తున్నారు. కొందరు సాధారణ జ్వరం, తలనొప్పేనని మాత్రలు వేసుకుంటున్నారు. దానివల్ల తాత్కాలిక ఉపశమనం దొరికినా లోపల వ్యాధి ముదురుతోంది. కొందరు కరోనా సోకినా తమకేమీ కాదన్న భావనలో ఉంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. వృద్ధులు, ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు లేనివారు సకాలంలో వ్యాధిని గుర్తించి వైద్యుల సలహాలు పాటిస్తే చాలామంది ఇంట్లో ఉన్నా నయం చేసుకోవచ్చు. వైద్యుల సలహాలు, పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
జ్వరం, దగ్గు, గొంతునొప్పితోపాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు, చలిజ్వరం, నడుంనొప్పి, విపరీతమైన అలసట, నీరసం, ఆయాసం, నాలుగడుగులు వేసినా గుండె దడగా ఉండటం, రోజువారీ పనులూ చేసుకోలేకపోవడం, రుచీవాసన కోల్పోవడం.. వీటిలో ఏ లక్షణం ఉన్నా కరోనా సోకిందేమోనని అనుమానించాలి. మరుగుదొడ్డికి వెళ్లి వస్తే నీరసం, నిస్సత్తువ ఆవరిస్తే కచ్చితంగా అనుమానించాల్సిందే.
సొంత వైద్యంతో చేటు
చాలామంది వాళ్లూ వీళ్లూ చెప్పారని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. 3, 4 రోజుల వరకు వ్యాధి లక్షణాలు తగ్గకపోతే అప్పుడు వైద్యుడి వద్దకు వెళుతున్నారు. వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించి ఫలితం వచ్చేసరికి మరో రెండు రోజులు గడుస్తోంది. అప్పటికే నష్టం జరుగుతోంది. అది జ్వరమైనా, మరో లక్షణమైనా.. పరీక్షలో కరోనాతో కాదని తేలేంతవరకు కరోనాగానే భావించాలి. వ్యాధి లక్షణం ఏది కనిపించినా కుటుంబ వైద్యుడినో, ఎవరైనా ఫిజీషియన్‌నో సంప్రదించాలి. వారిచ్చిన మందులు వాడుతూనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
* 3-4 రోజుల నుంచి వ్యాధి లక్షణాలున్నాయంటే కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. కొందరు పది రోజుల క్రితం జ్వరం వచ్చిందని, మాత్ర వేసుకుంటే తగ్గిందని, నిన్నటినుంచి మళ్లీ మొదలైందని వైద్యుల వద్దకు వెళుతున్నారు. వారికి సీటీస్కాన్‌ చేస్తే 99.9 శాతం మందిలో ఊపిరితిత్తుల్లో సమస్య కనిపిస్తోంది.
* ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు? వ్యాధి లక్షణాలుంటే ఏ వైద్యుడి వద్దకెళ్లాలి? హోంఐసొలేషన్‌లో ఉండి సమస్య తీవ్రమైతే ఏ ఆసుపత్రికి వెళ్లాలి వంటి సమాచారం అందరి వద్దా ఉంచుకోవాలి.

ఇంట్లో ఉన్నా వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి
- డా.యు.శ్రీలక్ష్మి

కొవిడ్‌ నిర్ధారణయ్యాక ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాలా? ఆసుపత్రిలో చేరాలా? అన్న విషయంలో వైద్యుల సలహా పాటించాలి. ఇంట్లో ఉండే చికిత్స తీసుకున్నా ప్రతి రోజూ ఆన్‌లైన్‌లోనైనా వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
* ఇంట్లో లైటో, ఫ్యానో ఎంత అవసరమో.. ఈ రోజుల్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ అంతే అవసరం. బాధితులు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ శాతాన్ని చెక్‌ చేసుకోవాలి. 6నిమిషాల నడక తర్వాత ఆక్సిజన్‌ శాతం 95కంటే కిందకు  పడిపోయినా, పల్స్‌రేట్‌ 100కిపైన ఉన్నా ప్రమాదాన్ని శంకించాల్సిందే.
* కరోనా లక్షణాలు మొదలైన నాలుగైదు రోజుల తర్వాత ఆగకుండా దగ్గు, జలుబు ఉంటే వైద్యుల సలహా మేరకు సీటీస్కాన్‌ చేయించుకోవాలి. సీటీస్కాన్‌లో 1-7 పాయింట్లు ఉంటే మైల్డ్‌, 8-15 పాయింట్లు ఉండే మోడరేట్‌, 15-25 మధ్య ఉంటే సీవియర్‌గా పరిగణిస్తారు.
* సీటీస్కాన్‌లో 1-7 పాయింట్లు, 8-15 పాయింట్లు ఉన్నవారికీ ఇంట్లో ఉంచే చికిత్సనందించవచ్చు. సీటీస్కాన్‌లో స్కోర్‌ 15 పాయింట్లకంటే ఎక్కువ చూపిస్తున్నవారికీ.. ఇతర ఆరోగ్య సమస్యలు లేనట్లయితే వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లో ఉంచే చికిత్సనందించవచ్చు.
* హోంఐసొలేషన్‌లో ఉన్నవారు వైద్యులు చెప్పిన మందులన్నీ వాడాలి. సూచనలను పాటించాలి. 8-10 గంటలపాటు బోర్లా పడుకోమంటే పడుకోవాలి.
* కొందరు కరోనా లక్షణాలు కనిపించిన మొదటి రోజో,  మరుసటి రోజే ఆర్టీపీసీఆర్‌ చేయించుకొని నెగెటివ్‌ వస్తే తమకేమీ పర్వాలేదన్న భరోసాతో ఉంటున్నారు. వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉంటే ఆర్టీపీసీఆర్‌లో గుర్తించలేరు. ఆ తర్వాత 2,3 రోజులకు వారిలో వైరస్‌ తీవ్రత పెరుగుతుంది. ఆర్టీపీసీఆర్‌లో.. సైకిల్‌ థ్రెషోల్డ్‌ (సీటీ) 1-20 మధ్య ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా, 20-32 మధ్య ఉంటే మధ్యస్థంగా, 32-35 మధ్య ఉంటే తక్కువగా పరిగణిస్తారు. 35కి మించి ఉంటే ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌ అని రాదు. ఆసుపత్రిలో చేరేందుకు వస్తున్న వారిలో ఎక్కువ శాతం సీటీ 12-20 మధ్య ఉంటోంది. వారికి చికిత్స కష్టమవుతోంది.

ముందే గుర్తిస్తే మేలు
డా.రామనరసింహం

కరోనా సోకినట్టు వెంటనే గుర్తిస్తే చాలా మంది భయపడాల్సిన పనిలేదు. ఐసొలేషన్‌లో ఉండి వైద్యుడి సలహా పాటిస్తే కొద్ది మందులు, తక్కువ ధర మందులతోనే నయమవుతుంది. మన దేశంలో చాలా మంది షుగర్‌, బీపీ టెస్టులకే భయపడుతుంటారు. కరోనా పరీక్షలలోనూ జాప్యం చేస్తున్నారు. కొందరు ఆవిరిపట్టడం, పసుపు వేసిన పాలు తాగడం వంటి చిట్కా వైద్యాలతో మరో 2,3 రోజులు వృథా చేస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం మాట పక్కనపెడితే, రోగుల్లో అనవసర ధైర్యం వస్తోంది. జ్వరమో, జలుబో వస్తే 2,3 రోజులు ఏ పారాసిటమాల్‌ వేసుకొని తగ్గకపోతే వైద్యుడి వద్దకు వెళదామన్న భావన చాలా మందిలో ఉంటోంది. కరోనా పరిస్థితుల్లో అలాంటి నిర్లక్ష్యం ఎంత మాత్రం సరికాదు.
* అమెరికా, బ్రిటన్‌లలో చాలా మందిని హోంఐసొలేషన్‌లో ఉంచే మందులతో నయం చేస్తున్నారు. అక్కడి ప్రజలు వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించడం వల్లే ఇది సాధ్యమైంది.
* కరోనా వచ్చినవారిలో కొందరు పల్స్‌ ఆక్సీమీటర్‌ను చూసుకొని భరోసాగా ఉంటున్నారు. ఏ అర్ధరాత్రో రీడింగ్‌ 90కంటే పడిపోతోంది. అప్పటికే సగం నష్టం జరుగుతుంది. 95కి వచ్చినప్పుడే వైద్యుడిని సంప్రదించాలి.
* ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడం వల్ల కొంత జాప్యం జరుగుతోంది. వైద్యుల అందుబాటు, ఉత్తమ సేవలపై అవగాహన, కచ్చితమైన ప్రణాళిక కలిగి ఉండాలి.
* కొందరు రక్తపరీక్షలు, సీటీ స్కాన్‌ వంటి ఇతర పరీక్షలు చేయించుకోవడానికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణైనప్పటి నుంచి మాత్రమే రోజులు లెక్క పెడుతున్నారు. ఇది సరికాదు. లక్షణాలు కనిపించినప్పటినుంచే మీలో వ్యాధి ఉన్నట్టే. అప్పటినుంచి లెక్కించి మీలో వ్యాధి లక్షణాల్నిబట్టి వైద్యుల సలహా మేరకు ఎన్ని రోజులకు ఏ పరీక్ష చేయించుకోమంటే అది చేయించుకోవాలి.

- ఈనాడు, అమరావతి

Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు