టీకాల్లో అట్టడుగున ఏపీ: Chandrababu
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాల్లో అట్టడుగున ఏపీ: Chandrababu

 ప్రణాళికాలోపమే దీనికి కారణం
 జగన్‌ అసమర్థత వల్ల ఆక్సిజన్‌ అందక 76మంది బలి
 తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక ఇప్పటివరకు 76మంది చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రూ.2లక్షల పరిహారమివ్వాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలు, మండల పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో 29మంది వరకు చనిపోయారనే వార్తలొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఘటనలో వాస్తవాల వెల్లడికి పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేశాం. ఆసుపత్రిలోకి అధికార పార్టీ నేతలను మాత్రమే అనుమతిస్తున్నారు. తెదేపా నాయకులను, సీపీఐ నేత నారాయణను ప్రభుత్వం అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతిపక్షానికి ఓ చట్టం, అధికార పార్టీ నాయకులకు మరో చట్టం ఎలా అమలుచేస్తారు?’ అని ప్రశ్నించారు. ‘ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు తమిళనాడు రాష్ట్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని 400 మెట్రిక్‌ టన్నుల నుంచి 1,200 మె.టన్నులకు పెంచుకుంది. కేరళ రాష్ట్రం మిగులు ఆక్సిజన్‌ సాధిస్తే ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతుండడానికి ప్రభుత్వ అసమర్థతే కారణం. ఆక్సిజన్‌ అందక మరణించిన రోగుల కుటుంబాలకు సంఘీభావంగా బుధవారం ఇళ్ల వద్ద తెదేపా కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలపాలి’ అని పిలుపునిచ్చారు.
లేఖలతోనే సమయం వృథా
దేశంలో వైరస్‌వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ‘ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చు. కరోనా కట్టడిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. ఇతర రాష్ట్రాలు పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు కొనుక్కుంటుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం లేఖలు రాయటంతోనే సమయం వృథా చేస్తున్నారు. టీకా కొనుగోళ్లలో కేరళ, గుజరాత్‌ ముందంజలో ఉన్నాయి. ఏపీలో మూడో దశ వ్యాక్సిన్‌ పంపిణీకి రూ.1,600కోట్లు అవసరం కాగా జగన్‌రెడ్డి మాత్రం రూ.45కోట్లతో సరిపెట్టారు. కరోనా రోగులకు తోచిన సాయం చేస్తూ తెదేపా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ప్రతి మండలానికో వైద్యుణ్ని నియమించి సేవలు విస్తరిస్తోంది’ అని వెల్లడించారు. సమావేశంలో పలు అంశాలపై పార్టీ తీర్మానించింది.
* దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పెట్టినందున ఏపీలోనూ విధించాలి.
* ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారి సంఖ్య, కరోనా మృతుల కుటుంబాలకు సాయం, వ్యాక్సినేషన్‌కు పెట్టిన ఆర్డర్లు, చెల్లింపు, బాధితులకు సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
* కరోనా మృతుల అంత్యక్రియలను ప్రభుత్వమే గౌరవప్రదంగా నిర్వహించాలి. దహన సంస్కారాలకు ముందుగా ప్రకటించినట్టు రూ.15వేల సాయమందించాలి.
* ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, పేదలకు నెలకు రూ.10వేల ఆర్థికసాయం చేయాలి.
* వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి. అన్నక్యాంటీన్లను పునరుద్ధరించాలి.
* మామిళ్లపల్లి ముగ్గురాయి గనుల్లో పేలుళ్లలో 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనవారి  లైసెన్స్‌ను రద్దు చేయాలి. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మల్లెల లింగారెడ్డి, కూన రవికుమార్‌, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని