రూ.9,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

ప్రధానాంశాలు

రూ.9,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో జప్తుచేసిన డీఆర్‌ఐ
విజయవాడ ఆషీ ట్రేడింగ్‌ పేరుతో దిగుమతి

అహ్మదాబాద్‌, ఈనాడు - అమరావతి: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్‌ ఉన్న 2 కంటెయినర్లను ఈ నెల 15న జప్తు చేసిన సంగతి ఆదివారం వెలుగులోకి వచ్చింది. అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ కేంద్రంగా పనిచేసే హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో వచ్చిన ఈ సరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు, సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటివరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు వచ్చాయి? ఏయే దేశాల నుంచి వచ్చాయి? తదితర వివరాలను కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ ప్రతినిధి ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించగా.. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ దీని మూలాలు విస్తరించినట్లు తేలింది. కేవలం దస్త్రాలు, కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది.

గతేడాది ఆగస్టులో నమోదు

విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధి చిరునామాతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ గతేడాది ఆగస్టు 18న నమోదు (రిజిస్టర్‌) అయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు అనే వ్యక్తి పేరిట ఈ కంపెనీని స్థాపించారు. బియ్యం, పండ్లు, కూరగాయల టోకు వ్యాపారం చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌ సమయంలో పొందుపరిచిన ఫోన్‌ నంబర్‌ మాత్రం ఎం.సుధాకర్‌ అనే వ్యక్తి పేరున ఉంది. ప్రస్తుతం ఆ ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోంది. అదే నంబర్‌తో ఉన్న వాట్సప్‌ ప్రొఫైల్‌ చిత్రాన్ని పరిశీలించగా.. చెన్నై కేంద్రంగా ‘ఆషీ సోలార్‌ సిస్టమ్‌’ అనే మరో కంపెనీని కూడా సుధాకర్‌ నెలకొల్పినట్లు తేలింది. దానికి సంబంధించిన బ్రోచర్‌ను తన ఫోన్‌ నంబర్‌, పేరుతో సహా ఆయన వాట్సప్‌ ప్రొఫైల్‌ చిత్రంగా పెట్టుకున్నారు.  

స్వస్థలం కాకినాడ.. ఎనిమిదేళ్లుగా చెన్నైలో నివాసం

కాకినాడకు చెందిన సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నై శివారు పోరూరులోని కోలపాకంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో సహానివాసం ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట పక్కింట్లో నివాసం ఉంటున్న ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన యువకుడిని సంప్రదించిన సుధాకర్‌.. తాను సౌర విద్యుత్తు వ్యవస్థకు సంబంధించిన వ్యాపారం చేయాలని భావిస్తున్నానని చెప్పారు. అందులో తనకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనందున సహకరించాలని కోరారు. అనంతరం ఆ యువకుడి ఫోన్‌ నంబర్‌ను కంపెనీ కాంటాక్ట్స్‌లో పొందుపరిచారు. కానీ ఆ కంపెనీ ద్వారా ఎలాంటి వ్యాపారమూ చేయలేదు.

నాలుగు రోజులుగా ఇంటికి తాళం..

ముంద్రా ఓడరేవులో ఈ నెల 15న (బుధవారం నాడు) డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌తో కూడిన కంటైనర్లను పట్టుకున్నారు. అవి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు రాత్రి నుంచి సుధాకర్‌ నివాసానికి (చెన్నై శివారు పోరూరులోని కోలపాకం) తాళం వేసేసి ఉందని.. ఆయన పక్కింట్లో ఉండే యువకుడు ‘ఈనాడు’ ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. ఆ యువకుడి ద్వారా సుధాకర్‌కు సంబంధించిన మరో ఫోన్‌ నంబర్‌ను తీసుకున్న ఈనాడు ప్రతినిధి ఆ నంబర్‌కు కాల్‌ చేయగా.. అది కూడా స్విచ్ఛాఫ్‌ ఉంది. ఆ నెంబర్‌తో ఉన్న వాట్సప్‌ను ఆయన చివరిసారిగా ఈ నెల 15న చూసినట్లు ఉంది. మరోవైపు నాలుగు రోజుల కిందట డీఆర్‌ఐ అధికారులు జీఎస్టీ సిబ్బందిని సంప్రదించి.. విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన పూర్వాపరాలను ఆరా తీశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని