ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ప్రధానాంశాలు

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ఆర్కే మృతిపై భార్య శిరీష

టంగుటూరు, న్యూస్‌టుడే: పేదలకు న్యాయం చేకూర్చే విషయంలో 40 ఏళ్లు ఆర్కే అలుపెరగని పోరాటం చేశారని.. నిత్యం ప్రజల కోసమే పరితపించేవారని ఆయన భార్య శిరీష విలపిస్తూ అన్నారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణవార్తను పార్టీ ధ్రువీకరించిన తర్వాత.. శిరీష, కుటుంబసభ్యులు విలపించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని నివాసం వద్దకు గ్రామస్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సందర్భంగా శిరీష విలేకర్లతో మాట్లాడుతూ వివిధ అంశాలను ప్రస్తావించారు.

‘సమాజం ఉన్నతంగా ఉండాలని ఆయన కోరుకునేవారు. ఆరోగ్యం, జీవితాన్ని పట్టించుకోకుండా నిత్యం ప్రజల కోసమే పనిచేశారు. ఆర్కేది సహజ మరణం కాదు, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దండకారణ్యాన్ని పోలీసులు చుట్టుముట్టి సరైన వైద్యం అందకుండా చేశారు. మెరుగైన చికిత్స అందితే ఆర్కే బతికేవారు. ఆయన మరణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. పోలీసులు మావోయిస్టులతో అధర్మ యుద్ధం చేస్తున్నారు. మావోయిస్టులకు తీసుకువెళ్లే ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారు. ప్రజల హక్కుల కోసం పాటు పడుతూ ఆర్కే వీరమరణం పొందారు. నాకు మరో బిడ్డ ఉంటే ఉద్యమానికే అంకితం చేస్తా. ఉంటే బాగుండేది’ అని ఆమె విలేకర్లతో చెప్పారు.

ప్రజల కోసమే అమరుడయ్యారు: విరసం నేత కల్యాణ్‌రావు

ఆర్కే ప్రజల మనిషని, ప్రజల హృదయాల్లో ఉంటారని, వారి కోసమే ఆయన అమరుడయ్యారని విరసం నేత కల్యాణ్‌రావు అన్నారు. ‘ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, కార్యవర్గ సభ్యులు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా తదితర నేతలు శిరీషను పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఇలాంటి నాయకుడిని కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, ఆశయాలను మున్ముందు కొనసాగిస్తామని తెలిపారు. శిరీషను శనివారం అమరుల బంధుమిత్రుల సంఘం గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు భవాని, శోభ పరామర్శించారు. ఆర్కే మరణంలో ప్రభుత్వహస్తం ఉందని ఆరోపించారు.

ఆర్కే మరణం తీరని లోటు: జనశక్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్కే మరణం విప్లవోద్యమానికి, ప్రజాయుద్ధానికి తీవ్ర నష్టమని సీపీఐ(ఎం.ఎల్‌)జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి విశ్వనాథ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విప్లవ నాయకులు ఒక్కొక్కరే అనారోగ్య కారణాలతో అమరులవడం విషాదకర పరిణామమన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని