
తెలంగాణ
పంచాయతీల్లో ప్రక్రియ పూర్తి
2.11 లక్షల అభ్యంతరాల నమోదు
ఈనాడు, హైదరాబాద్: గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిట్లో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రం వందశాతం పూర్తిచేసింది. ఇందుకోసం ఆర్థికమంత్రి హరీశ్‌రావు వివిధ సందర్భాల్లో రాష్ట్ర ఆడిట్ శాఖతో సమావేశమై ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు 13 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ 49 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామపంచాయతీల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 2,11,816 అభ్యంతరాలను నమోదు చేశారు..
మండల, జిల్లా పరిషత్‌లు కూడా..
మండల, జిల్లా పరిషత్లలోనూ ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆడిట్‌శాఖ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. 540 మండల పరిషత్‌లకు గాను 146 పరిషత్‌లలో ఆడిటింగ్ పూర్తయిందన్నారు. మిగిలినవి జాప్యంలేకుండా పూర్తిచేస్తామన్నారు. జిల్లా పరిషత్లవి కూడా పూర్తిచేసి వివరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మండల పరిషత్‌ల ఆడిట్‌ను ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, ఒడిశా మాత్రం ప్రారంభించాయన్నారు. తమ సిబ్బందికి లభించిన ప్రత్యేక శిక్షణ, అవగాహనతోనే వందశాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ 14 రాష్ట్రాలు మాత్రమే గ్రామపంచాయతీల ఆన్లైన్ ఆడిట్ విధానాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు.