
క్రీడలు
లఖ్‌నవూ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లఖ్‌నవూ ఫ్రాంఛైజీ తమ జట్టు పేరును సోమవారం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల సూచించిన పేర్ల నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. గతేడాది బిడ్డింగ్‌లో లఖ్‌నవూ ఫ్రాంఛైజీని రూ.7,090 కోట్లకు ఆర్‌ఎస్‌పీజీ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు పేరు పెట్టాలని ఆ సంస్థ అభిమానులకు పిలుపునిచ్చింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘‘జట్టుకు పేరు సూచించే పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. లక్షలాది ప్రజలు వివిధ పేర్లు పంపించారు. వాటి ప్రకారం లఖ్‌నవూ ఐపీఎల్ జట్టుకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అని పేరు పెట్టాం’’ అని ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వీడియో సందేశంలో తెలిపాడు. ఈ ఏడాది నుంచి ఐపీఎల్లో లఖ్‌నవూతో పాటు అహ్మదాబాద్ జట్టు కూడా కొత్తగా చేరనున్న సంగతి తెలిసిందే. లఖ్‌నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.