Venkaiah Naidu: తెలుగు ప్రజలకు గర్వకారణం

వైకాపా రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి

ఈనాడు, దిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కోట్లాది తెలుగు ప్రజలకు గర్వకారణమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. వెంకయ్యనాయుడి పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభలో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో తెలుగు వ్యక్తి కూర్చోవడాన్ని ఉభయ సభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. అనేక సభల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేశాయని అన్నారు. వెంకయ్యనాయుడి ప్రసంగాలతో ఒక విద్యార్థిగా తానూ ఎంతో ప్రభావితమయ్యానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషలతోపాటు తమిళంలోనూ ఆయనకు మంచి పరిజ్ఞానం ఉందని అన్నారు. రాజ్యసభను సమర్థంగా నడపడంతోపాటు కొత్త, పాత సభ్యులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించడం ఆయన ప్రత్యేకతని వివరించారు. ఆర్టికల్‌ 370 రద్దుపై 2019 ఆగస్టు 5న జరిగిన చర్చను విజయసాయి గుర్తు చేసుకున్నారు. ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్నా ప్రాంతీయ పార్టీలకు సైతం ఆ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించడం ఆయన గొప్పదనానికి నిదర్శనమన్నారు. ఆరేళ్ల కిందట సభలో అడుగు పెట్టినప్పుడు చివరి వరుసలో కూర్చున్న తనకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని సంశయించానని, ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అంతమందిలోనూ తనను గుర్తించి ప్రోత్సహించారని తెలిపారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీలకు వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రాధాన్యం ఎనలేనిదని వివరించారు. ప్యానల్‌ ఛైర్మన్‌గా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నిర్వహించే అవకాశం కల్పించడం తన జీవితంలో మరుపురానిదని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని