Anand Mahindra: మీతో పాటు దేశం మొత్తం డ్యాన్స్‌ చేస్తోంది..!

ఇదీ భారత్‌ అంటే: మహీంద్రా

దిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం పొంది మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో 16 సంవత్సరాల తర్వాత పతకం సాధించిన జట్టు.. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్‌లతో గెలుపు సంబరాలు జరుపుకొంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దేశ యువతకు ‘మండే మోటివేషన్’ అందించారు.

‘ఈ రోజు మండే మోటివేషన్‌కు నాకు మరో అంశం దొరికింది. మైదానంలో ఎలా డ్యాన్స్‌(ఆట ఆడటం) చేయాలో ఈ హాకీ జట్టుకు తెలుసు. అందులో ఆశ్చర్యం లేదు. దేశం మొత్తం కూడా వారితో పాటు డ్యాన్స్ చేసేలా చేశారు. ఇదీ భారత్‌ అంటే..!’ అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే మన హాకీ జట్టు సభ్యులు చేస్తోన్న డ్యాన్స్‌ వీడియోను షేర్ చేశారు. అందులో వారంతా ‘సునో గోర్‌ సే దునియా వాలో’ అనే దేశభక్తి గీతానికి కాలు కదిపారు. కాగా, ఈ విజయంపై నెటిజన్లు అభినందనలు తెలిపారు. 

ఆదివారం న్యూజిలాండ్‌తో కాంస్యం కోసం జరిగిన పోరులో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు న్యూజిలాండ్‌ స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌కు దారితీసింది. ఇందులో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. 



మరిన్ని

ap-districts
ts-districts