Kejriwal: సంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. ఇదెక్కడి ప్రభుత్వం..?

కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత హామీలు, పథకాలపై (Freebies) భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతూ, ధనికులకు మాత్రం భారీ స్థాయిలో రుణ మాఫీలు చేస్తోందని ఆరోపించారు.

‘2014లో కేంద్ర బడ్జెట్‌ రూ.20లక్షల కోట్లు. ప్రస్తుతం అది రూ.40లక్షల కోట్లకు చేరింది. అందులో దాదాపు రూ.10లక్షల కోట్లు సంపన్నులు, వారి మిత్రుల రుణాలను మాఫీ చేయడానికే ఖర్చు చేస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలకు కూడా రూ.5లక్షల కోట్లను ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. అటువంటి రుణాలను మాఫీ చేయకుంటే.. పేద ప్రజల అన్నంపై పన్ను విధించే పరిస్థితి వచ్చేదే కాదు’ అని కేంద్ర ప్రభుత్వంపై అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో పేదరికంతో యాచించే వారు కూడా బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇలా అత్యంత పేదలపైనా పన్నుల భారం మోపుతోందంటే కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే వాటిలో కొంత మాత్రమే రాష్ట్రాలకు ఇస్తుంది. అంతకుముందు 42శాతం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అది 29-30శాతానికి పడిపోయింది. 2014తో పోలిస్తే ఇప్పుడు రెండు, మూడు రెట్లు అదనంగా పన్నులను కేంద్రం వసూలు చేస్తోంది. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది..?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. సైనికులకు పెన్షన్లు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చారన్న ఆయన.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఫించన్లకు డబ్బులు లేవని చెప్పడం ఇదే తొలిసారి అని విమర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts