close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాంద్యానికేదీ సమగ్ర చికిత్స?

ప్రపంచం నలుమూలలా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం తాలూకు ప్రభావం ప్రసరించి దేశీయంగానూ వృద్ధిరేటు అంచనాలు తెగ్గోసుకుపోతున్నాయి. ఆరువారాల క్రితం పార్లమెంటుకు సమర్పించిన కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక, దేశంలో మాంద్యం తొంగిచూస్తున్నదని ప్రమాదఘంటికలు మోగించింది. వాస్తవానికి రెండేళ్లనాడే అటువంటి సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. అంతకు ఆరేళ్లముందుతో పోలిస్తే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 34శాతంగా ఉన్న పెట్టుబడులు 29శాతానికి కుదించుకుపోయినా- ఉత్పాదకత, వినియోగం జోరుమీద ఉన్నందువల్ల అప్పట్లో సంక్షోభం తలెత్తలేదు. కొన్నాళ్లుగా ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు చతికిలపడి దేశంలో వస్తుసేవలకు ప్రజలు పెట్టే ఖర్చూ తగ్గుముఖం పట్టడం ప్రస్తుత ఆందోళనకర మాంద్యానికి ఆజ్యం పోసింది. నిరుడు ఏప్రిల్‌-జూన్‌ మధ్య తయారీరంగాన నమోదైన 12.1శాతం వృద్ధి ఏడాది తిరిగేసరికి 0.6శాతానికి క్షీణించింది. గిరాకీ కుంగి స్థిరాస్తి రంగం డీలాపడగా, ఆటొమొబైల్‌ రంగం ఇరవై సంవత్సరాల్లో అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆతిథ్య, రవాణా, సమాచార ప్రసార, వ్యవసాయ తదితర రంగాల్నీ మాంద్యం పీడిస్తోంది. రాష్ట్రాలు బడ్జెట్లనూ సవరించుకోవాల్సిన స్థితికి చేరి ఆర్థికమాంద్యం ఉరుముతోంది. తక్కిన రాష్ట్రాలకన్నా కొంత మెరుగ్గా ఉన్నామంటున్న తెలంగాణలోనే సుమారు 35వేలకోట్ల రూపాయల మేర వార్షిక బడ్జెట్‌ పరిమాణాన్ని కుదించడానికి ప్రధాన కారణం మాంద్యమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరించారు. కమ్ముకొస్తున్న ముప్పును ఏడాది క్రితమే రిజర్వ్‌ బ్యాంకు పసిగట్టి రెపోరేటు(దేశంలో ద్రవ్య సరఫరాను నిర్దేశించే ప్రాతిపదిక)లో సహేతుక మార్పులు ప్రవేశపెట్టి ఉంటే, ఈసరికే వ్యవస్థ కోలుకోగలిగేదన్న విశ్లేషణలు- లోపమెక్కడుందో చాటుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనా, పరిస్థితి చెయ్యిదాటిపోతున్న దశలోనైనా ప్రభుత్వపరంగా సత్వర దిద్దుబాటు చర్యలు పట్టాలకు ఎక్కుతున్నాయా?

దాదాపు ఇరవై రోజుల క్రితం, ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిప్పికొట్టేందుకంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరు సూత్రాల ప్రణాళిక ప్రకటించారు. అందులో భాగంగా, విదేశీ సంస్థాగత మదుపరులపై ఇటీవలి బడ్జెట్లో విధించిన సర్చార్జిని తొలగించారు. పర్యవసానాల తీవ్రతను ఊహించకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించడంతోపాటు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు జీఎస్‌టీ బకాయిల చెల్లింపు సమస్యనూ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గృహ వాహన రుణాలపై భారం తగ్గుతుందని, పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చూస్తామని ఇచ్చిన హామీలు గురికి బారెడు దూరమే! అమెరికాకు చెందిన లేమాన్‌ బ్రదర్స్‌ పెట్టుబడి బ్యాంకు దివాలా తీసి 2008నాటి మాంద్యాన్ని ప్రజ్వరిల్లజేయడం తెలిసిందే. దేశంలోనూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సమస్యల కూపంలో కూరుకుపోవడం, వాణిజ్య యుద్ధ ప్రభావం, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు తదితరాలు మాంద్యాన్ని ప్రేరేపించాయి! దేశార్థికాన్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల భూరి వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో 2022లోగా కోటి కోట్ల రూపాయలు వ్యయీకరించనున్నట్లు రెండు నెలల క్రితం కేంద్రం ప్రకటించింది. ఆ మొత్తాన్ని ఎలా సమీకరించాలన్నదానిపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీనొకదాన్ని కొలువుతీరుస్తామనీ వెల్లడించింది. కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తాజా ప్రకటన ప్రకారం- పెట్టుబడుల సేకరణకు, ఉపాధి కల్పనకు రెండు క్యాబినెట్‌ కమిటీలు అవతరించాయి. దేశార్థికాన్ని మరింత గుల్లబార్చేలా మాంద్యం ముమ్మరించేలోగానే, సమగ్ర దిద్దుబాటు చర్యలు ఊపందుకోవాలి.

రమారమి పద్దెనిమిదేళ్ల కిందట దేశాన్ని కల్లోలపరచిన మాంద్యానికి సేవారంగం చతికిలపాటు ప్రబల హేతువని అప్పట్లో కేంద్ర ఆర్థిక సర్వే ధ్రువీకరించింది. నాడు వేటు సేవారంగానిదైతే, నేటి వేట తయారీ రంగం కుంగుదలతో మొదలైంది. ఆరేళ్ల క్రితం రెండంకెల ద్రవ్యోల్బణం రెచ్చిపోతున్నవేళ సైదోడుగా మాంద్యం విజృంభించింది. ప్రస్తుతం అధిక ద్రవ్యలోటు, స్వల్ప వడ్డీరేట్లు, బలహీనపడిన రూపాయి, మూడు శాతానికి పరిమితమైన ద్రవ్యోల్బణం... మునుపటికి ఇప్పటికి మాంద్యం స్వరూప స్వభావాల్లో, నేపథ్యంలో భారీ అంతరాన్ని కళ్లకు కడుతున్నాయి. జీడీపీలో మొన్న ఏప్రిల్‌-జూన్‌ మధ్య నమోదైన అయిదు శాతం వృద్ధిరేటు గడచిన 25 త్రైమాసికాల్లో అత్యంత కనిష్ఠం. ఈ దుస్థితిని చెదరగొట్టడంలో మీనమేషాలు లెక్కించడమన్నది ఎంత మాత్రం తగని పని. పెద్దయెత్తున ఉపాధి కల్పనకు దోహదపడే జౌళి, వాహన, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు వ్యవస్థాగత తోడ్పాటు ఇనుమడిస్తే- తల వేలాడేసిన నిర్మాణ, స్థిరాస్తి రంగాలూ చురుకందుకుంటాయి. తయారీ రంగం బహుముఖ సవాళ్ల పాలబడి కునారిల్లుతున్న దృష్ట్యా, పారిశ్రామికాభివృద్ధి సూచీ కోలుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుందంటున్న నిపుణులు- ఉద్దీపన చర్యలు ఉరకలెత్తాలని ఉద్బోధిస్తున్నారు. మాంద్యం పేరిట పారిశ్రామిక రంగానికి పన్ను రాయితీలేమిటని మూడు వారాలనాడు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ కొట్టిపారేసినప్పటితో పోలిస్తే- కేంద్ర ప్రభుత్వ తాజా ధోరణిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. వృద్ధిరేటు కోలుకోవాలంటే విద్యుత్తు, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో సమస్యల్ని సత్వరం పరిష్కరించి, ప్రైవేటు పెట్టుబడులు జోరెత్తేలా దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాలని రఘురాం రాజన్‌ ప్రభృతులు సూచిస్తున్నారు. మాంద్యం పీడిస్తున్నప్పుడు ప్రభుత్వ వ్యయీకరణను సత్వరం భారీగా పెంచడమే అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటివి నిష్ఠగా పాటిస్తున్న ఉపశమన సూత్రం. దేశీయంగానూ నేడదే అనుసరణీయ మార్గం!


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు