close

ఈనాడు ప్రత్యేకం

వినియోగం.. వినాశకం

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వాడకం.. మూడేళ్లలోనే రెట్టింపు..
అక్టోబరు 2 నుంచి దీనిపై పోరాటానికి కేంద్రం నిర్ణయం
నేటి నుంచి స్వచ్ఛత సేవ కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణలో ఏటా 2.50 లక్షల టన్నుల వినియోగం

దేశంలో ప్లాస్టిక్‌ వాడకం ఏటికేడాది పెరుగుతోంది. 2001తో పోలిస్తే 2017 నాటికి 60 రెట్లు పెరిగింది. దీని తయారీలో వాడే పాలిథిన్‌ మట్టిలో కలిసిపోదు. నీటిని భూమిలోకి ఇంకనివ్వదు. దీనిని కాలిస్తే వెలువడే విషవాయువులతో శ్వాసకోశ జబ్బులు వస్తాయి.

ఈనాడు - హైదరాబాద్‌

దయం లేచింది మొదలు అన్నింటా ప్లాస్టిక్‌ వాడకమే. విచ్చలవిడిగా వాడడం.. బయట పారేయడం వల్ల చెరువులు, చెత్తకుండీలు, రైలు పట్టాల వెంట.. ఎక్కడచూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే. ఇలా తెలంగాణలో పోగవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల మొత్తం ఎంతో తెలుసా? 2016లో 1.20 లక్షల టన్నులుంటే.. ఇప్పుడది దాదాపు 2.50 లక్షల టన్నులకు పెరిగింది. ప్లాస్టిక్‌ మితిమీరిన వినియోగం, దాని వల్ల కలిగే అనర్థాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రభుత్వం నుంచి నియంత్రణ చర్యలు పెరగాలని.. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

ఇంటి నుంచే మార్పు రావాలి
ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు ఇప్పుడున్న నిబంధనలు సరిపోవు. ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ను వాడిన తర్వాత సేకరించి తిరిగి ఉపయోగించడం మేలు. జనం కూడా ప్లాస్టిక్‌ సీసాల బదులు గాజు, స్టీలు గ్లాసుల్లో నీళ్లు తాగాలి. క్యారీబాగ్‌లకు బదులు గుడ్డ సంచులు, పేపర్‌ బ్యాగ్‌లు వాడాలి. షాంపూలు వంటి వాటికి ప్లాస్టిక్‌ సీసాల బదులు గాజువి వినియోగించాలి.

- కె.ఎస్‌.వెంకటగిరి, సీఐఐ-జీబీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

అన్నింటిని నిషేధించాలి
షాపులు, చిరువ్యాపారుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్‌ మందాన్ని తనిఖీ చేయడానికి ఇప్పుడున్న యంత్రాంగం చాలదు.  50 మైక్రాన్ల లోపు కవర్లకు నిషేధాన్ని పరిమితం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. మందంతో నిమిత్తం లేకుండా ఒకసారి వాడి పారేసే అన్నిరకాల ప్లాస్టిక్‌ను నిషేధించాలి.

- వీరన్న, పీసీబీ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌

50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాం
రైలు ప్రయాణాల్లో ప్లాస్టిక్‌ వినియోగం వల్ల నష్టాలను గుర్తించాం. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నీళ్ల సీసాలను ముక్కలుగా చేసే 22 క్రషింగ్‌ యంత్రాలను ఏర్పాటుచేశాం. రైల్వే స్టేషన్లలో వ్యాపారులు ప్లాస్టిక్‌ సంచులు వాడకూడదని ఆదేశించాం. ఒకసారి వాడి పారేసే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ను అక్టోబరు 2 నుంచి నిషేధిస్తాం. మిగిలిన ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధాన్ని దశలవారీగా అమలుచేస్తాం.

- గజానన్‌ మల్య, జీఎం, ద.మ.రైల్వే

తయారీ దగ్గరే ఆపాలి
ఆహారం ప్యాక్‌ చేయడంలో, నీళ్లు తాగేందుకు కప్పులు, కొబ్బరిబొండాలు, పళ్లరసాలు.. ఇలా ప్రతిచోట ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతోంది. క్యారీ బ్యాగుల్లో తెచ్చుకుంటున్నాం. నిత్యం వందల టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. దీనిమూలంగా అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్‌ తయారీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించడం ఉత్తమం. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ తయారీని నిలిపివేస్తే సమస్య ఉండదు.

- విజయలక్ష్మి, ప్రొఫెసర్‌, జేఎన్‌టీయ

వెయ్యేళ్లకు పైనే..
మట్టిలో పారేసినా అందులో కలిసిపోని ఘనవ్యర్థం ప్లాస్టిక్‌. 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాలకుపైనే పడుతుంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా దాని అమలు మొక్కుబడిగానే మిగిలింది.

కదిలింది కేంద్రం
ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యను గుర్తించిన కేంద్రం నివారణపై దృష్టి పెట్టింది. ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ‘ప్టాస్టిక్‌ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమం’ చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. బుధవారం నుంచి ‘స్వచ్ఛతసేవ’ కార్యక్రమం ప్రారంభించి.. అక్టోబరు 2 నుంచి ప్లాస్టిక్‌పై పోరాటానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు