close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొనండి.. తిరగండి.. ఇచ్చేయండి!

బై బ్యాక్‌ జమానా

మూణ్నాలుగేళ్లు కాగానే బండి మార్చేయడం కొందరికి అలవాటు... మేటి ఫీచర్లతో వచ్చిన కారుని సొంతం చేసుకోవాలన్నది ఇంకొందరి ఆశ... పాత దాన్నేం చేయాలనేది పెద్ద గందరగోళం... ఒకవేళ అమ్మితే సరైన ధర దక్కుతుందో, లేదోనన్న భయం... వీటన్నింటికీ విరుగుడుగా ‘బై బ్యాక్‌’ ఆప్షన్‌ ప్రవేశపెట్టాయి ఆటోమొబైల్‌ కంపెనీలు... ‘కొత్త కారు కొనండి.. నాలుగైదేళ్లు వాడాక తిరిగిచ్చేయండి.. మీకు నచ్చే ధర చెల్లిస్తాం’ అంటున్నాయి... ఆర్థిక మందగమనంతో నెమ్మదించిన అమ్మకాలకు విరుగుడుగా.. కొనుగోలుదారుల మనసు గెలుచుకునే మంత్రంగా నిలుస్తోంది ఈ నయా ట్రెండ్‌.
వినియోగదార్లను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త దారులు వెతుకుతూ తమ సృజనాత్మకత చూపిస్తుంటాయి వాహన తయారీ సంస్థలు. ఆ ఒరవడిలో వచ్చిందే వాహనాల్ని వినియోగదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయడం. సాధారణంగా కారు, బైక్‌ నెలరోజులు వాడినా పాత వాహనం కిందే లెక్క. ఆటోమేటిగ్గా దాని విలువ పడిపోతుంది. దాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు. మంచి ధర రాబట్టుకోలేరు. ఇలాంటి వాళ్లకు ‘మూడు, నాలుగేళ్లు వాహనం వాడుకొని తిరిగిచ్చేయండి. అరవైశాతం వరకు విలువ లెక్కగట్టి ఇస్తామ’ని ప్రకటిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మన కారు ధర ఎంతో ముందే తెలిసిపోవడంతో నచ్చినవాళ్లు కొనడానికి ముందుకొస్తారు. వాహనం కొనుగోలుదారులు, అమ్మకందారులిద్దరికీ ఇది ఉపయుక్తం.
ఇదీ లెక్క
బెంజ్‌, బీఎండబ్ల్యూ, టాటా, హోండా, మహీంద్రా, టయోటా, స్కోడాల నుంచి కొత్తగా భారతీయ మార్కెట్లోకి వచ్చిన ఎంజీ మోటార్స్‌ దాకా ఎన్నో వాహన తయారీ సంస్థలు తమ కస్టమర్లు వాడిన వాహనాలను తిరిగి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ‘బై బ్యాక్‌’ అంటుంటే.. ఇంకొన్ని ‘ఈజీ బై’ పేరుతో వాహనాల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ఎంజీ మోటార్స్‌ దీనికి ‘3-60 ప్రోగ్రామ్‌’ అని పేరు పెట్టింది. ప్రస్తుతం అత్యధిక ధర ఉండే సెడాన్‌, ఎస్‌యూవీ, లగ్జరీ కార్లకే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో చిన్న, తక్కువ ధర ఉండే వాహనాలకూ ఈ ఆఫర్‌ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు హోండా కార్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ రాజేశ్‌ గోయెల్‌. మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు వాడిన కార్లకు గరిష్ఠంగా 60శాతం నుంచి 47శాతం వరకు విలువ చెల్లించి కార్లను వెనక్కి తీసుకుంటామని ఆటోమొబైల్‌ కంపెనీలు చెబుతున్నాయి. నిర్ణీత సమయానికి సర్వీసింగ్‌ చేయడం, సరైన నిర్వహణ, ప్రయాణించిన కిలోమీటర్లు.. ఇవన్నీ సక్రమంగా ఉంటే ఈ బై బ్యాక్‌ వర్తిస్తుంది. కారు పెద్ద ప్రమాదానికి గురైనా, నిర్వహణ అధ్వానంగా ఉన్నా.. బై బ్యాక్‌ విలువలో తేడా వస్తుంది. అప్పటి పరిస్థితికనుగుణంగా ధర లెక్కగడతారు. మూడు నుంచి ఐదేళ్లు గడిచాక ఆ ఆఫర్‌ని తీసుకోవాలా? వద్దా? అన్నది కారు యజమాని ఇష్టం. నచ్చితే వెనక్కి ఇచ్చేయొచ్చు. లేదంటే తన దగ్గరే అట్టేపెట్టుకోవచ్చు. వాహనం మార్చుకుంటే పాత కారు రుణ మొత్తాన్ని కొత్తదానికి బదలాయించుకొనే వెసులుబాటూ డీలర్లు కల్పిస్తారు. అంటే ఒకే డౌన్‌ పేమెంట్‌తో రెండు కార్లు కొనొచ్చు అన్నమాట. నాలుగైదేళ్లకోసారి బండి మార్చే అలవాటు ఉన్నవారికి, కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్‌ కావాలనుకునేవారికి ఇంతకన్నా ఏం కావాలి? పైగా కొనుగోలుదారులకు ఎలాంటి వ్యయ ప్రయాసలుండవు.

ఇద్దరికీ లాభం
ప్రస్తుతం అత్యధిక ధర ఉండే కార్లపై ఈ బై బ్యాక్‌ ఆఫర్లు ఇస్తున్నారు. హై-ఎండ్‌ కార్లకి కాలం గడిచినకొద్దీ విలువ తరుగుదల ఎక్కువగా ఉంటుంది. అత్యధిక రేటుతో కొన్న వాహనం కొన్నేళ్లు వాడిన తర్వాత దాన్ని ఎవరికైనా అమ్మాలన్నా పెద్దగా ధర పలకదు. దీంతో ఈ సెగ్మెంటులో వాహనం కొనాలని చాలామంది అనుకున్నా రీసేల్‌ ఉండదనే ఉద్దేశంతో  వెనకాడుతుంటారు. ఆ భయం లేకుండా మీ కారుని మేమే కొంటాం అని భరోసా ఇచ్చేలా కంపెనీలు ఈ ఆఫర్‌ ప్రవేశపెట్టాయి. మహీంద్రాతోపాటు.. దాదాపు అన్ని వాహన కంపెనీలు.. ఈ అవకాశం ఇస్తున్నాయి. అమ్మకాలు పెంచుకోవడంతోపాటు, కస్టమర్‌కి ఒక విశ్వాసం కలిగించడం దీని ఉద్దేశం. ఏ డీలర్‌ దగ్గర బండి కొన్నారో అక్కడే సర్వీసింగ్‌ చేయించాలనే నియమం ఉంటుంది ఇందులో. ఈ మధ్య కాలంలో బండి పెద్ద ప్రమాదానికి గురికావొద్దని కొత్త వాహనం కొన్నప్పుడే సేల్‌ అగ్రిమెంట్‌లో ఈ బై బ్యాక్‌ ఒప్పందం రాసుకుంటారు. తర్వాత బై బ్యాక్‌ ఇవ్వాలా, వద్దా అన్నది కారు యజమాని ఇష్టం.

- కిరణ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా  
తిరిగిచ్చే ధరలివి
* బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.42 లక్షలు. నాలుగేళ్ల తర్వాత తిరిగిచ్చేస్తే రూ.23లక్షలు ఇస్తారు.
* మూడేళ్లు వాడిన మాంజా మోడల్‌ని టాటా మోటార్స్‌ అరవైశాతం ధరతో కొనుగోలు చేస్తోంది.
* అల్టురస్‌ ధర రూ.35లక్షలు. మూడేళ్లు వాడుకొని ఇస్తే 57శాతం వెనక్కి ఇచ్చేస్తామంటోంది మహీంద్రా.
* హోండా సీఆర్‌-వీ ధర: రూ. 32 లక్షలు. మూడేళ్ల బై బ్యాక్‌ ధర రూ.17 లక్షలు.
* స్కోడా సూపర్బ్‌ ధర రూ.24లక్షలు. మూడేళ్ల తర్వాత 57శాతం ధరతో వెనక్కి తీసుకుంటారు.
* ఎంజీ హెక్టార్‌ ధర రూ.11.50లక్షలు-రూ.17లక్షలు. మూడేళ్లయ్యాక 60శాతం విలువతో తీసుకుంటామంటోంది.
* టయోటా కిర్లోస్కర్‌ ఇండియా అన్ని మోడళ్లపై 60శాతం బై బ్యాక్‌తో కొనుగోలు చేస్తోంది.
* మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఈ, జీఎల్‌ఎస్‌, ఎస్‌-క్లాస్‌ వేరియంట్లపై బైబ్యాక్‌ ప్రకటించింది.

అత్యధిక వాహన ప్రమాదాలకు కారణం మితిమీరిన వేగం. బండి స్పీడ్‌ పెరిగేకొద్దీ దాన్ని నియంత్రించే సామర్థ్యం తగ్గుతూ, ప్రమాద ముప్పు పెరుగుతుందంటారు వాహన రంగ నిపుణులు. గంటకు 35 కిలోమీటర్ల లోపు వేగంలో ఉన్నప్పుడే కోరుకున్నచోట బ్రేక్‌ వేయగలం. అది దాటితే.. బ్రేక్‌ వేయాలనుకున్న ఆలోచన వచ్చి పెడల్‌ తొక్కేసరికే వాహనం కొంతదూరం ముందుకెళ్లిపోతుంది. ఈ విధంగా.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు