close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మనసుకు గాయం..మేం కానీయం!


చాలారోజుల నుంచి దగ్గుతో బాధ పడుతున్నా. నెలరోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నా. ఇది కరోనానేనా? నాకు చాలా భయంగా ఉంది.

- ఫోన్‌ కాల్‌లో ఓ మహిళ


ఉద్యోగరీత్యా థానేలో ఉంటున్నా. కొద్దిరోజుల నుంచి దగ్గు వస్తోంది. వైద్యుడి దగ్గరికెళ్తే మామూలుదేనని మందులిచ్చారు. కానీ నా సహోద్యోగులు నన్ను అనుమానిస్తున్నారు. కొవిడ్‌-19 పరీక్ష చేసుకొమ్మని గొడవ చేస్తున్నారు. వాళ్ల బాధపడలేక టెస్ట్‌కి వెళ్లాలనుకుంటున్నా.

- మహారాష్ట్ర నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఆవేదన


ఇలాంటి వందల సందేహాలు, వేల బాధలకు మాటల మందు వేస్తోంది ‘కొవిడ్‌ సాథీ’...జనాన్ని కుంగుబాటు నుంచి బయట పడేస్తూ బతుకుపై భరోసా కల్పిస్తోందీ హెల్ప్‌లైన్‌. హైదరాబాద్‌కి చెందిన మాల పరోపకారి, రజనీ కాసు దీన్ని ప్రారంభించారు..


కరోనా సంబంధిత సమస్యలు, సందేహాలు, మానసిక ఒత్తిళ్లు ఏమైనా ఉంటే 7702500928 నంబర్‌కి ఫోన్‌ చేసి సాయం పొందవచ్చు. పనివేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.


కరోనా కాలంలో హెల్ప్‌లైన్‌ చేయూత!

వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం. టెక్నాలజీతో కృత్రిమ మేధ సృష్టించాం. అయినా ఈ వైరస్‌ను జయించలేక మొత్తం ప్రపంచమే వణికిపోతోంది. కరోనా వేలమందిని పొట్టన పెట్టుకుంటుంటే కోట్ల మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఆ మహమ్మారి నన్నెక్కడ చుట్టుకుంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో ఉద్యోగాల భయం చాలామందిని వెంటాడుతోంది. దీనికి మనమేం చేయలేమా? అని ఆలోచించారు హైదరాబాద్‌కు చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, అపర్ణ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మాల, జిప్పీస్‌ వ్యవస్థాపకురాలు రజనీ. వీరు ఐఎస్‌బీ సహాధ్యాయినులు. కార్యక్షేత్రంలోకి దిగి నేరుగా సేవలు అందించకపోయినా కరోనా కారణంగా అనుమానం, భయం, కోపం, ఒత్తిడి, కుంగుబాటుకు గురైన వారికి అండగా నిలవాలనుకున్నారు. జనాన్ని భయం నుంచి బయట పడేసేలా ఏదైనా హెల్ప్‌లైన్‌ ప్రారంభించాలనుకున్నారు.
చేతులు తోడయ్యాయి
ఆచరణ మొదలైంది. ప్రముఖ సైకాలజిస్టులు, సైక్రియాటిస్ట్‌లతో చర్చించారు. ఏదైనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్నప్పుడు, ఉత్పాతాలు సంభవించినప్పుడు జనాల్లో అతి ఉత్సుకత, భయం, కుంగుబాటు తలెత్తడం సహజమేనని వాళ్లకు తెలిసింది. హెచ్‌1ఎన్‌1, సార్స్‌, మెర్స్‌లాంటి సంక్షోభ సమయంలో, అనంతరమూ ప్రజలు మానసికంగా దెబ్బతిన్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుత సమయంలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లను గుర్తించి, వాళ్లలో మానసిక    స్థైర్యం పెంపొందించాలనుకున్నారు. అలా కొవిడ్‌ సాథీ సహాయ కేంద్రం పురుడు పోసుకుంది. డాక్టర్‌ హరిణి, వరుతో సహా సేవా భావం ఉన్న మరికొందరు ఈ ఇద్దరితో చేతులు కలిపారు. అందులో సైకాలజిస్టులు, సైక్రియాటిస్ట్‌లు, సంస్థల అధిపతులు, ఉద్యోగులున్నారు. మొత్తం 25 మందితో కూడిన సేవాసైన్యం తయారైంది. అంతా పైసా ప్రయోజనం ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారే. వీళ్లంతా ఎవరి ఇళ్లలో వారు ఉండి ఐవీఆర్‌ పద్ధతి ద్వారా బాధితులకు సాయం అందిస్తున్నారు.  
ఇలా భరోసా
సమస్య, సందేహం, బాధతో ఎవరైనా ఫోన్‌ చేయగానే కొవిడ్‌ సాథీ సభ్యులు మీకొచ్చిన ఇబ్బందేమీ లేదంటూ వారిని అనునయిస్తారు. సమస్యను సావధానంగా విని పరిష్కారాలు సూచిస్తారు. మానసికంగా భరోసానిస్తారు. సంభాషణ పూర్తయిన తర్వాత ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్లు, ఆసుపత్రుల వివరాలు, సేవా కేంద్రాల వివరాలతో కూడిన సందేశాన్ని బాధితుడి సెల్‌ఫోన్‌కి పంపిస్తారు. అవతలి వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితి ప్రతికూలంగా ఉంటే ఏ వైద్యుడిని కలవాలో సూచిస్తారు. వాళ్లు చెప్పిన లక్షణాలతో కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు అనిపిస్తే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కి అనుసంధానిస్తారు. కొవిడ్‌ సాథీకి వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేస్తున్నారు.
అందరిదీ అదే అనుమానం
వారం కిందట మొదలైన హెల్ప్‌లైన్‌కి దేశం నలుమూలల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. రకరకాల వ్యక్తులు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు తమ బాధలు వినిపిస్తూనే ఉన్నారు. పల్లె, పట్టణం, చదువుకున్నవారు, చదువురాని వారు అనే తేడా లేదు. అందులో కరోనా సోకిందోనేమో అనే అనుమానం, ఉద్యోగ భద్రతపై బెంగ ఉన్నవాళ్లే ఎక్కువంటారు మాల. అతిగా కరోనాకు సంబంధించిన వార్తలు చూడటం, వినడం, సామాజిక మాధ్యమాల నుంచి ప్రతికూల సమాచార వ్యాప్తి ద్వారానే జనం మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్టు వారు గమనించారు. మేం సందేహాలు తీర్చి, సాంత్వన పరిచాక తొంభైశాతం మందిలో భయాందోళనలు తొలగిపోయినట్టు గమనించామంటారు రజనీ.


మరిన్ని