close

గ్రేటర్‌ హైదరాబాద్‌

స్వచ్ఛభారత్‌ అందరి కర్తవ్యం కావాలి 

యువతలో సేవాభావం లోపిస్తుండడం బాధాకరం 
‘ఈనాడు’తో జాతీయ యువజన పురస్కార గ్రహీత ఒద్దిరాజు వంశీకృష్ణ 
ఈనాడు - హైదరాబాద్‌

స్వచ్ఛభారత్‌ సంకల్పం ఇంటింటికీ విస్తరించాలని, ప్రతీ పౌరుడు పరిశుభ్రత, పచ్చదనాన్ని బాధ్యతగా స్వీకరించాలని జాతీయ యువజన పురస్కార గ్రహీత ఒద్దిరాజు వంశీకృష్ణ అన్నారు. హైదరాబాద్‌ పాతనగరం ఉప్పుగూడలోని భయ్యాలాల్‌ నగర్‌కు చెందిన ఇరవైనాలుగేళ్ల యువకుడైన వంశీకృష్ణ సోమవారం దిల్లీలో కేంద్ర యువజన సంక్షేమ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేతుల మీదుగా జాతీయ యువజన పురస్కారం అందుకున్నారు. దేశంలో సేవాతత్పరులైన 20 మంది యువకులు ఈ పురస్కారాలను పొందగా వారిలో వంశీకృష్ణ ఒకరు. తెలంగాణ నుంచి పురస్కారం అందుకున్న ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

సేవా కార్యకలాపాలకు ఎవరు స్ఫూర్తి? 
మాది పేద కుటుంబం. అమ్మ, నాన్నలు చిరుద్యోగులైనా డబ్బు ఆశించకుండా తోటి వారికి సహాయపడేవారు. వారే నాకు స్ఫూర్తి. చిన్నతనం నుంచే నాకు చేతనైన సాయం చేయాలని, సమాజానికి మేలు చేయాలని అనుకున్నాను. పాఠశాలలో చదువు తర్వాత తరగతి గదులను పరిశుభ్రం చేసేవాడిని, చెత్తచెదారం తొలగించే వాడిని. పదో తరగతి వరకు సెలవుల్లో మా కాలనీలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటర్‌కు వచ్చాక నెహ్రూ యువ కేంద్ర సంఘటనకు ఎంపికయ్యాను. ఆ తర్వాత సేవా కార్యక్రమాలు, శిబిరాలు, గ్రామాల సందర్శన వంటి వాటిల్లో పాల్గొన్నాను.

సేవలతో చదువుకు ఆటంకం కలగలేదా? 
చదువు కొనసాగిస్తూనే సేవ చేశాను. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. అందరూ ప్రోత్సహించారు. సేవ ద్వారా మానసికానందాన్ని పొందేవాణ్ని. అందుకే చదువు కూడా సాఫీగా సాగింది. సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించిన వారికి కేంద్రం ఈ పురస్కారాలను ఇస్తుంది. నేను చిన్ననాటి నుంచి చేసిన సేవలను వివరిస్తూ దరఖాస్తు చేశాను.

మీకు నచ్చిన కార్యక్రమాలేమిటి? 
స్వచ్ఛభారత్‌ చాలా గొప్ప కార్యక్రమం. ప్రస్తుతం దేశానికి అవసరమైంది ఇదే. పట్టణాల్లో, నగరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. అడవులు హరించుకుపోతున్నాయి. కాలుష్యం పెరిగింది.  అలాగే ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో సామాజిక సేవాభావం లోపిస్తోంది. వీటన్నింటికి స్వచ్ఛభారత్‌ తగిన పరిష్కారం. ఇందులో నేను విస్తృతంగా పాల్గొన్నాను. దేశంలో ఎక్కడికైనా వెళ్లి పనిచేయడానికైనా నేను సిద్ధమే.

ఈ పురస్కారంపై మీ స్పందన ఏమిటి? 
దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యత మరింత పెరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రజలను చైతన్యపరుస్తాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చాలామంది పేదలకు తెలియక నష్టపోతున్నారు. దళారులు వారిని మోసగిస్తున్నారు. వాటిని అరికట్టేందుకు కృషి చేస్తాను. సామాజిక చైతన్యం వెల్లివిరియాలి. ప్రతీ ఒక్కరిలోనూ కరుణ, దయ పెరగాలి. శాంతి స్థాపన జరగాలి. ఇందుకోసం నావంతు పాత్ర పోషిస్తాను.

పాతనగరం నుంచి సేవారత్నం 

హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన వంశీకృష్ణ తల్లి శ్రీదేవి అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు. తండ్రి శ్యామ్‌సుందర్‌రావు ప్రైవేటు ఉద్యోగి. వంశీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివారు. చిన్నతనం నుంచే సేవా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తల్లితోపాటు పల్స్‌పోలియో, టీకాలు, పౌష్టికాహార పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్షరాస్యత పెంపు, వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిరోధంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రక్తదానం, శ్రమదానంపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు. స్వచ్ఛభారత్‌ మొదలయ్యాక అందులో విస్తృతంగా పాల్గొన్నారు.

దేశానికి మార్గదర్శకులు మీరే: వెంకయ్యనాయుడు 
జాతీయ యువజన పురస్కార గ్రహీతలు సామాజిక సేవా కార్యక్రమాలతో దేశానికి మార్గదర్శకులుగా నిలవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. యువతలో చైతన్యం తెచ్చి వారి ఉత్తమ మార్గంలో నడిపించాలన్నారు. మంగళవారం జాతీయ యువజన పురస్కారాన్ని స్వీకరించిన ఒద్దిరాజు వంశీకృష్ణతో పాటు గత అయిదేళ్లుగా ఈ పురస్కారాలు పొందిన కొండా రవి, రాజేందర్‌, దేశబోయిన నర్సింహులు. మాణిక్యాలరావు, మనీశ్‌ గవాయి, పానుగంటి మహేశ్‌, అంకిత్‌ పాండే, మహేందర్‌ రాజేందర్‌లు దిల్లీలో వెంకయ్యను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారందరినీ అభినందించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు