close

తెలంగాణ

దమ్ముంటే మజ్లిస్‌తో తలపడండి

చేతనైతే కేంద్ర సాయం తీసుకురండి
భాజపాపై మంత్రి తలసాని ధ్వజం
హైదరాబాద్‌ యూటీపై వదంతుల్ని పట్టించుకోబోమని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నేతలు పొద్దస్తమానం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబపైనా, తెరాసపైనా విమర్శలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి తెలంగాణకు ఏదైనా గట్టి సాయం చేయించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలన్నారు. భాజపా నేతలు వారి బలం గురించి అతిగా ఊహించుకుంటున్నారని, మజ్లిస్‌ను బూచిగా చూపి ప్రజలకు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ యూటీ, రెండో రాజధాని అనే వదంతులను తాము పట్టించుకోబోమని అన్నారు. భాజపా తమకు పోటీయే కాదని, ముందు పాతబస్తీలో మజ్లిస్‌తో తలపడి వారి బలాన్ని నిరూపించుకోవాలన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇతర నేతలు పొద్దున లేచింది మొదలు కేసీఆర్‌ కుటుంబం మీద పడి ఏడుస్తున్నారు. నిన్న మొన్న భాజపాలో చేరిన ఓ నేత ఏదోదో మాట్లాడుతున్నారు. గతంలో తెరాస ఆయనకు గౌరవం వచ్చింది. ఆయన తండ్రికి హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేసిందనే విషయం మర్చిపోయారు. కేంద్రం నుంచి తెలంగాణకు ప్రాజెక్టును కానీ, నిధులు కానీ తెచ్చి భాజపా పరపతిని పెంచుకోవాలి తప్ప ఇలా కాదు. నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతోనే ఆ పార్టీ వారు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వచ్చిన జడ్పీ, మండల ఎన్నికల గురించి మాత్రం వారు మాట్లాడడం లేదు. శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన భాజపా 103 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. 17 ఎంపీ స్థానాల్లో తెరాస 8 గెలిచింది. భాజపాకి వచ్చినవి నాలుగే. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ బలపడతానంటే ఎవరూ కాదనరు. ఇష్టారాజ్యంగా మాట్లాడి పరువు తీసుకోవద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటారు. 370 అధికరణ, ముమ్మారు తలాక్‌ల విషయంలో అలాగే వ్యవహరించారు. పండుగలను మేమే అధికారికంగా నిర్వహిస్తున్నాం ప్రపంచస్థాయిలో యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. భాజపా ఇంత వరకు ఒక్క గుడినైనా కట్టించలేదు. యాగాలు, హోమాలు చేయడం కూడా వారికి చేతకాదు. కేసీఆర్‌కే సాధ్యం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నదే సీఎం తపన. నీటి పంపకాలు సజావుగా ఉండేలా చొరవ చూపుతున్నారు. ఇక్కడి భాజపా నేతలు కొత్త శాసనసభ వద్దంటున్నారు. కేంద్రం కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తామంటే మేం మద్దతునిస్తాం’ అని తలసాని అన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు