బంగారంపై ఎంత ప‌న్ను ప‌డుతుందో తెలుసా? - Tax-on-sale-of-gold
close

Updated : 01/01/2021 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారంపై ఎంత ప‌న్ను ప‌డుతుందో తెలుసా?

బంగారం ఏ రూపంలో కొనుగోలు చేశారు అనే దానిపై ఆధార‌ప‌డి ప‌న్ను ఉంటుంది.. భార‌త‌దేశంలో ఉన్న అనేక సాంప్ర‌దాయాల్లో ఒక‌టిగా ధ‌న‌త్ర‌యోద‌శి రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తారు. ఈ ఏడాది బంగారం కొనాల‌నుకున్న‌వారికి సార్వ‌భౌమ బాండ్లు కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. జువెల‌ర్లు ఇప్ప‌టికే పండ‌గ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ధ‌న‌త్ర‌యోద‌శి రోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్‌ఛేంజీలు గోల్డ్‌ ఈటీఎఫ‌ల కోసం ట్రేడింగ్ స‌మ‌యాన్ని ఏడు గంట‌ల వ‌ర‌కు పొడ‌గించాయి. సాధార‌ణంగా రోజు మాదిరిగా ట్రేడింగ్ సెష‌న్ ఉదయం 9.15 నుంచి మ‌ధ్యాహ్నం 3.30 వ‌ర‌కు ముగిసిన త‌ర్వాత‌, గోల్డ్ ఈటీఎఫ్, ఎస్‌జీబీల ట్రేడింగ్ సాయంత్రం 5 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుందని ఎక్స్‌ఛేంజీలు వెల్ల‌డించాయి.

మీ పోర్ట్‌ఫోలియోలో బీమా మాదిరిగానే బంగారం పెట్టుబ‌డులు కూడా ఉండ‌టం అవ‌స‌రం. అయితే 5-10 శాతం గ‌రిష్ఠంగా బంగారం పెట్టుబ‌డులు ఉంటే చాలు. అంత‌కంటే ఎక్కువ‌గా బంగారం కొనుగోలు చేయడం మంచి నిర్ణ‌యం కాదు. ఒక‌వేళ పెళ్లి కోసం ఎక్కువ బంగారం కొనుగోలు చేయాల్సి వ‌స్తే ఫ‌ర్వాలేదు కానీ, సాధార‌ణంగా బంగారం కోసం ఎక్కువ పెట్టుబ‌డులు కేటాయించ‌క‌పోవ‌డం మంచిదని ఆర్థిక స‌ల‌హాదారులు చెప్తున్నారు.

బంగారంపై ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను కూడా తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో బంగారం విక్ర‌యిస్తే దీనిపై అవ‌గాహ‌న ఉండాలి. బంగారంపై క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. దాంతో పాటు ఎంత‌కాలం బంగారం నిల్వ ఉంచుకుంటున్నారో కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌స్తుంది. కొనుగోలు చేసిన మూడేళ్ల‌లోపు తిరిగి విక్ర‌యిస్తే దానిని స్వ‌ల్ప‌కాలికంగా, అంత‌కంటే ఎక్కువ కాలం ఉంచుకుంటే దీర్ఘ‌కాలికంగా లెక్కిస్తారు.

దీర్గ‌కాలిక‌, స్వ‌ల్ప‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్
బంగారం విక్ర‌యంపై స్వ‌ల్పకాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ మీ మొత్తం ఆదాయానికి క‌లిపి దాని ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు. దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ పై ప‌న్ను 20.8 శాతం (సెస్‌తో క‌లిపి) ప‌డుతుంది. ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ద్ర‌వ్యోల్బ‌ణం లెక్కించిన త‌ర్వాత బంగారం అమ్మిన ధ‌ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఫిజిక‌ల్ గోల్డ్‌పై ప‌న్ను 
బంగారం నాణేలు, ఆభ‌ర‌ణాలు, బిస్కెట్ల రూంప‌లో కొనుగోలు చేసిన మూడేళ్ల‌లోపు విక్ర‌యిస్తే స్వల్ప‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్‌గా లెక్కించి దాని ప్ర‌కారం ప‌న్ను లెక్కిస్తారు. మూడేళ్ల త‌ర్వాత విక్ర‌యిస్తే దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ ప‌న్ను ప‌డుతుంది.

గోల్డ్ ఈటీఎఫ్‌, గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను
గోల్డ్ ఈటీఎఫ్‌లకు సెక్యూరిటీల ఆధారంగా ధ‌ర‌లు నిర్ణ‌యిస్తారు. స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల‌లో ఇవి ట్రేడ‌వుతాయి. బంగారం మ్యూచువ‌ల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లు విక్ర‌యిస్తే వ‌చ్చే లాభాల‌పై ప‌న్ను ఫిజిక‌ల్ గోల్డ్ మాదిరిగానే ప‌రిగ‌ణిస్తారు.

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు
ఇవి ప్ర‌భుత్వ సెక్యూరిటీలు. బాండ్ల రూపంలో గ్రాముల‌ను కొనుగోలు చేస్తారు. కాలానుగుణంగా ఆర్‌బీఐ, ప్ర‌భుత్వం త‌ర‌పున వీటిని జారీ చేస్తుంది. మెచ్యూరిటీ గ‌డువు 8 సంవ‌త్స‌రాలు. ఐదో ఏడాది నుంచి వీటిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. మెచ్యూరిటీ పూర్త‌యేంత వ‌ర‌కు కొన‌సాగాగిస్తే క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ ఉండ‌దు. గోల్డ్ ఈటీఎఫ్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఈ స‌దుపాయం లేదు.

గోల్డ్ బాండ్లపై వార్షికంగా 2.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. టీడీఎస్ వ‌ర్తించ‌దు. జారీ చేసిన 15రోజులలోపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంగారు బాండ్లను ట్రేడ్‌ చేయవచ్చు. మెచ్యూరిటీ కంటే ముందు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఉప‌సంహ‌రించుకుంటే దీర్ఘ‌కాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ ఉన్న‌ప్ప‌టికీ ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ఫిజిక‌ల్ గోల్డ్ కంటే బాండ్ల రూపంలో కొనుగోలు చేస్తే మేల‌ని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం నిల్వ చేసుకునేందుకు రిస్క్ ఉండ‌దు. భ‌ద్ర‌త ఉంటుంది. మార్కెట్‌లో బంగారం విలువను బ‌ట్టి బాండ్ల ధ‌ర‌లు పెరుగుతాయి. వ‌డ్డీ కూడా ల‌భిస్తుంది. బంగారం స్వ‌చ్ఛ‌త‌, నాణ్య‌త , త‌యారీ ఛార్జీలు వంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో పాటు పెట్టుబ‌డులు, వ‌డ్డీ హామీ కూడా ఉంటుంది. సార్వ‌భౌమ పసిడి బాండ్ల‌పై జీఎస్‌టీ కూడా ఉండ‌దు. సాధార‌ణంగా అయితే బంగారం విక్ర‌యాల‌పై జీఎస్‌టీ 3 శాతం ఉంటుంది.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని