ఆకర్షణీయ సంస్థల్లో గూగుల్‌కు అగ్రస్థానం - Top of the list of attractive companies for Google
close

Updated : 30/06/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆకర్షణీయ సంస్థల్లో గూగుల్‌కు అగ్రస్థానం

రెండు, మూడు స్థానాల్లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌

దిల్లీ: దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కంపెనీగా గూగుల్‌ ఇండియా నిలిచింది. ఆ తరవాతి స్థానాల్లో అమెజాన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఉన్నట్లు ఉద్యోగ నియామకాల సేవలను అందించే రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) సర్వే వెల్లడించింది. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు, బ్రాండ్‌ పేరు, ఆకర్షణీయ వేతనం తదితర అంశాల ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లు తెలిపింది. ఈ సర్వేలో నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్‌ ఉండగా,  టాటా స్టీల్‌ (5), డెల్‌ టెక్నాలజీస్‌ (6), ఐబీఎం (7), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (8), విప్రో (9), సోనీ (10) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. పని-వ్యక్తిగత జీవితాన్ని సమతౌల్యం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్న కంపెనీల వైపు అధిక శాతం ఉద్యోగులు మొగ్గు చూపిస్తున్నారు. 65శాతం మంది ఉద్యోగులు పని-వ్యక్తిగత జీవితం సమతౌల్యానికి ప్రాధాన్యం ఇస్తుండగా.. వేతనం, ఇతర ప్రయోజనాలకు 62శాతం ఉద్యోగులు ఆకర్షితులవుతున్నారు. ఉద్యోగ భద్రత, పని వాతావరణం కూడా ఉద్యోగాల ఎంపికలో కీలకంగా మారిందని సర్వే పేర్కొంది.

ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఐపీఓకు సన్నాహాలు

దిల్లీ: నిధుల సమీకరణ కోసం అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకువెళ్లేందుకు ఎన్‌టీపీసీ సన్నాహాలు చేస్తోంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల లక్ష్యాన్ని సాధించేందుకు, నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురుదీప్‌ సింగ్‌ తెలిపారు. దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన బ్లూమ్‌బర్గ్‌ ఎన్‌ఈఎఫ్‌ (బీఎన్‌ఈఎఫ్‌) సదస్సులో ఆయన మాట్లాడారు. కంపెనీ ఏటా 7-8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను పెంచుకోనుందని, ఇది కష్టతరమేమీ కాదని అన్నారు. 2032కు 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబరులో పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఎన్‌టీపీసీ ఏర్పాటు చేసింది.

‘ ఎన్‌ఫోర్సింగ్‌ కాంటాక్ట్స్‌ పోర్టల్‌’ ఆవిష్కరణ

దిల్లీ: భారత్‌లో సులభతర వాణిజ్యానికి మరింత వీలు కల్పించే దిశగా ఒక పోర్టల్‌ మొదలైంది. చట్ట-విధానపరమైన సంస్కరణల సమాచారంతో ‘ఎన్‌ఫోర్సింగ్‌ కాంట్రాక్ట్స్‌ పోర్టల్‌’ను న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రటరీ(జస్టిస్‌) వరుణ్‌ మిత్రా ఆవిష్కరించారు. ప్రపంచంలో 191 దేశాల్లో వ్యాపార నిబంధనలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ‘డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్ట్‌’ వెలువరుస్తుంటుంది. ఇందులోనూ సులభతర వాణిజ్యం(ఈఓడీబీ) సూచీ ద్వారా దేశాలకు ర్యాంకులు ఇస్తుంటుంది. అందులో ‘ఎన్‌ఫోర్సింగ్‌ కాంట్రాక్ట్స్‌’ అనే ప్రమాణాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఏదైనా ప్రామాణీకరించిన వాణిజ్య వివాదాన్ని పరిష్కరించడానికి పట్టే సమయం, వ్యయాలను ఇది చెబుతుంది. ప్రస్తుతానికి దిల్లీ, ముంబయిలు మాత్రమే ప్రపంచ బ్యాంకు నిర్వహించే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే కింద ఉన్నాయి. త్వరలో కోల్‌కతా, బెంగళూరు కూడా జతచేరే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్సింగ్‌ కాంట్రాక్ట్స్‌ పోర్టల్‌లో దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతాల్లోని ప్రత్యేక వాణిజ్య కోర్టుల్లోని కేసుల వివరాల తాజా సమాచారాన్ని ఉంచుతారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని