close

Updated : 22/04/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ చికిత్సకు మోల్నుపిరవిర్‌!

 ప్రాథమిక పరీక్షల్లో సానుకూల ఫలితాలు
 దేశీయంగా క్లినికల్‌ పరీక్షలకు సన్నాహాలు
 అనుమతులు రాగానే తయారీకి స్థానిక ఫార్మా కంపెనీలు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: మోల్నుపిరవిర్‌... ఇన్‌ఫ్లుయంజా వ్యాధికి వినియోగించే ఈ ఔషధం ఇప్పుడు శాస్రతవేత్తల నోళ్లలో నానుతోంది. కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే శక్తి ఈ మందుకు ఉందనే నమ్మకం వారిలో బలపడుతోంది. కొవిడ్‌ తీవ్రతను గణనీయంగా తగ్గించే శక్తి దీనికి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో, దీనిపై తదుపరి ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం ఒక ఆశారేఖ మాదిరిగా కనిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే..  ఈ ఔషధం సమర్థత నిర్ధారణ కాగానే, వెను వెంటనే దాన్ని ప్రజలకు అందించడానికి హైదరాబాద్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే మోల్నుపిరవిర్‌ ఫార్ములాను సమకూర్చుకోవడంతో పాటు అన్ని రకాల తయారీ ఏర్పాట్లు మొదలు పెట్టాయి. అన్నీ కుదిరితే ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల మాదిరిగానే మోల్నుపిరవిర్‌ను సైతం స్థానిక ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 మోల్నుపిరవిర్‌ ప్రత్యేకతలు
* జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ తొలిసారిగా దీన్ని ఆవిష్కరించింది.
* ఇన్‌ఫ్లుయంజా వ్యాధికి చికిత్సలో ఈ మందు వినియోగిస్తున్నారు.
* ఇది కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేయగలుగుతుందనే విశ్వాసంతో ‘రీపర్పసింగ్‌’ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
* ఫెర్రెట్‌ మోడల్‌ (ఒక రకమైన ఎలుక జాతి జంతువుల)పై పరీక్షల్లో అత్యంత సానుకూల ఫలితాలు కనిపించాయి. తదుపరి అమెరికాలో 1450 మంది మనుషులపై ప్రయోగించగా, ఈ మందు 24 గంటల వ్యవధిలో కొవిడ్‌-19 వ్యాధిపై ప్రభావం చూపుతుందని స్పష్టమైందని సమాచారం.
* ఈ మందును ట్యాబ్లెట్ల రూపంలో నోటి ద్వారా తీసుకోవచ్చు.
* అమెరికా, ఐరోపా దేశాల్లో దీనిపై ప్రస్తుతం ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలు (మానవ ప్రయోగాలు) నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆ రెండే
కొవిడ్‌- 19 వ్యాధికి ఇంతవరకూ సరైన ఔషధం లేదు. వ్యాధి లక్షణాలకు చికిత్స చేయటం మినహా, ఫలానా మందు వాడితే కొవిడ్‌ వ్యాధి అదుపులోకి వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ‘ఫావిపిరవిర్‌’ ట్యాబ్లెట్లను వైద్యులు సిఫారసు చేస్తున్నారు. కొవిడ్‌-19 చికిత్సకోసం ‘రెమ్‌డెసివిర్‌’ ఇంజెక్షన్‌ను వ్యాధి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉన్న రోగులకు ఆసుపత్రులలో మాత్రమే ఇస్తున్నారు. ‘రెమ్‌డెసివిర్‌’ కు మనదేశంలోనూ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చారు. ఈ రెండూ తప్పిస్తే, కొవిడ్‌-19 వ్యాధికి ప్రత్యేకంగా ఇతర ఏ ఔషధమూ లేదు. ఈ రెండింటికి ఇప్పుడు ‘మోల్నుపిరవిర్‌’ జతకలిసే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక వ్యాధిని పూర్తిస్తాయిలో అదుపు చేసే సత్తా దీనికి ఉన్నట్లుగా భావిస్తున్నారు.
తయారీ సన్నాహాలు
మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసేదిగా సిద్ధం చేసే పనిలో (రీపర్పస్‌) జర్మనీకి చెందిన రిజిబెల్‌ అనే ఫార్మా కంపెనీ, యూఎస్‌కు చెందిన మెర్క్‌ నిమగ్నమయ్యాయి. ఈ సంస్థలు నిర్వహించిన మొదటి, రెండో దశ క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినందున ఇప్పుడు మూడో దశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మెర్క్‌ ఈ ఔషధంపై ఎంతో దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోల్నుపిరవర్‌ తయారీ విధానాన్ని (ప్రాసెస్‌) అభివృద్ధి చేయడంతో పాటు, నియంత్రణ సంస్థల అనుమతి వచ్చిన వెంటనే తయారు చేసి మార్కెట్లో విడుదల చేసేందుకు హైదరాబాద్‌లోని మూడు, నాలుగు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీనిపై అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసే సన్నాహాల్లో ఈ కంపెనీలు ఉన్నట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని