6 నెలల్లో హెరిటేజ్‌ రుణరహితం
close

Updated : 29/07/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 నెలల్లో హెరిటేజ్‌ రుణరహితం

విలువ జోడించిన ఉత్పత్తులపై దృష్టి

అయిదారేళ్లలో సగం ఆదాయం ఈ విభాగం నుంచే

’ఈనాడు‘తో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి

ఈనాడు, హైదరాబాద్‌:  పాలు, పాల ఉత్పత్తుల వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమైన హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  రూ.648.10 కోట్ల ఆదాయాన్ని, రూ.30.30 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చినప్పుడు ఆదాయాలు, లాభాలు స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో విలువ జోడించిన ఉత్పత్తుల (వాల్యూ యాడెడ్‌ ప్రోడక్ట్స్‌) విభాగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ ఆదాయాల్లో విలువ జోడించిన ఉత్పత్తుల వాటా ప్రస్తుతం 29 శాతం ఉంది. ఈ విభాగ ఆదాయాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ‘ఈనాడు’ కు తెలిపారు. వచ్చే అయిదారేళ్లలో వార్షిక ఆదాయాల్లో, విలువ జోడించిన ఉత్పత్తుల వాటా 50 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ విభాగంపై దృష్టి సారించి పలు నూతన ఉత్పత్తులు ఆవిష్కరించామని, ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తామని ఆమె వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 3 ఉత్పత్తులు తీసుకువచ్చామని తెలిపారు. దీనివల్ల లాభాల శాతం పెరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఏప్రిల్‌-జూన్‌లో ముంబయి మార్కెట్లో విడుదల చేసిన ఉత్పత్తులను, హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.  హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొంతకాలంగా రుణభారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం డెట్‌-ఈక్విటీ నిష్పత్తి  0.04 శాతం మాత్రమే ఉంది. మిగిలిన అప్పు కూడా వచ్చే 6 నెలల వ్యవధిలో తీర్చివేయాలని భావిస్తున్నట్లు, దీంతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ రుణ రహిత కంపెనీ అవుతుందని నారా బ్రాహ్మణి వివరించారు.

ఏటా రూ.100 కోట్ల మూలధన పెట్టుబడి: ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇటీవల వరకు ఏటా రూ.100 కోట్ల వరకు మూలధన పెట్టుబడి పెడుతూ వచ్చింది. దీనివల్ల కంపెనీ పలు కొత్త ఉత్పత్తులు విడుదల చేయగలిగింది. మూలధన పెట్టుబడి ఇకపై పరిమితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ముంబయి, దిల్లీ సహా దేశంలోని ముఖ్యమైన మార్కెట్లకు తాము విస్తరించామని, అక్కడ వాటా పెరిగితే ఆదాయం- లాభదాయకతను పెంచుకోగలుగుతామని స్పష్టం చేశారు.  


నూతన సీఈఓ నియామకం

హెరిటేజ్‌ ఫుడ్స్‌కు కొత్తగా శ్రీదీప్‌ నాయర్‌ కేశవన్‌ను సీఈఓగా నియమించారు. మార్కెటింగ్‌, విక్రయాల విభాగంలో ఆయనకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఇంతకు ముందు ఆయన కోకో కోలా, ఒలమ్‌ ఇంటర్నేషనల్‌ తదితర సంస్థల్లో   పనిచేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని