జనవరికల్లా భారత్‌లో 1.4కోట్లకు పైగా కేసులు! - A mathematical model says Indias Covid-19 caseload may reach 14.57 mn by Jan
close
Updated : 30/10/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరికల్లా భారత్‌లో 1.4కోట్లకు పైగా కేసులు!

ఐఐటీ కాన్పూర్‌ బృందం అంచనా

దిల్లీ: వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్‌ తగ్గుతున్నప్పటికీ మున్ముందు రోజుకు 81వేలు చొప్పున కొత్త కేసులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్పూర్‌ ఐఐటీకి చెందిన భౌతికశాస్త్రం ప్రొఫెసర్‌ మహేంద్ర వర్మ నేతృత్వంలోని బృందం చేపట్టిన మ్యాథమెటికల్‌ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. యూరప్‌లోని ఎనిమిది దేశాల్లో నమోదైన కేసుల డేటాతో సరిపోల్చి మ్యాథమెటికల్‌ పద్ధతిలో గణాంకాలను విశ్లేషించారు. ఫ్రాన్స్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, జర్మనీలలో నమోదైన గణాంకాల ఆధారంగా విశ్లేషించి అంచనా వేసినట్టు మహేంద్ర వర్మ తెలిపారు. భారత్‌లో సెప్టెంబర్‌ 22 వరకు నమోదైన కేసులను ప్రామాణికంగా తీసుకున్నామని, అప్పటికి ప్రపంచ గ్రాఫ్‌తో దాదాపు సమాంతరంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగా భారత్‌లో 2021 జనవరి 1 వరకు కేసుల ట్రెండ్‌ ఎలా ఉండబోతోందనేది అంచనా వేసినట్టు వివరించారు. అయితే, భారత్‌లో ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుతున్నాయని, ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించకపోతే మాత్రం మరింతగా విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. 2021 జనవరి 1నాటికి మొత్తం కేసుల సంఖ్య దాదాపు 14.57 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.  

అలాగే, భారత్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి చేరువయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 38 కోట్ల మంది ప్రజలు ఈ వైరస్‌కు గురికావడమో, వారిలో యాంటీబాడీలు ఉండటమో జరిగిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) అనే సంస్థ చేపట్టిన సూపర్‌ మోడల్‌ అంచనా వేసింది. అలాగే, 2021 నాటికి భారత్‌లో కరోనా వ్యాప్తి 10.6 మిలియన్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు, భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గినట్టే కనిపించి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రోజుకు 36 వేల కేసులకు పడిపోయినప్పటికీ మళ్లీ గత 24గంటల్లో 48వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 80.88లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 1.21లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 73.73 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 5.94లక్షల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. భారత్‌లో పండుగ సీజన్‌ కావడానికి తోడు చలికాలం మొదలుకావడంతో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. అందుకే ప్రజల మరింత జాగ్రత్తగా ఉండాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. దిల్లీతో పాటు పశ్చిమబంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో రోజువారీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని