కొవిడ్‌ ఇమ్యూనిటీ: 8నెలల పాటు యాంటీబాడీలు..! - Corona Immunity lasts 8 months
close
Updated : 23/12/2020 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఇమ్యూనిటీ: 8నెలల పాటు యాంటీబాడీలు..!

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తులు రెండోసారి వైరస్‌ బారినపడకుండా కనీసం ఎనిమిది నెలల పాటు యాంటీబాడీల రక్షణ ఉంటుందని తాజా పరిశోధన వెల్లడించింది. తిరిగి వైరస్‌ బారిన పడకుండా రక్షించడంలో కీలకమైన మెమొరీ కణాలు దీర్ఘకాలంపాటు శరీరాన్ని అప్రమత్తం చేస్తాయని తెలిపింది. వ్యాక్సిన్‌ల వల్ల ఎక్కువ కాలం మరింత రక్షణ పొందే అవకాశాలకు ఈ పరిశోధన బలమైన ఆధారమని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకతపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయన నివేదిక తాజాగా సైన్స్‌ ఇమ్యూనాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

కరోనా సోకిన తర్వాత వారిలో వృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని నెలలు మాత్రమే వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని ఇదివరకు వచ్చిన అధ్యయనాల్లో తేలింది. స్వల్ప కాలంలోనే ఇమ్యూనిటీ కోల్పోవడంపై వచ్చిన వార్తలు కాస్త ఆందోళనకు గురిచేశాయి. అయితే, ఈ రోగనిరోధకత దాదాపు 8నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం, రోగనిరోధక వ్యవస్థలో ఉండే మెమొరీ బీ సెల్స్‌, వైరస్‌ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్‌ను సుదీర్ఘకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయని వెల్లడించారు. అదే వ్యక్తిపై మరోసారి వైరస్‌ దాడిచేసినప్పుడు వెంటనే గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన యాంటీబాడీలను వేగంగా ఉత్పత్తి చేస్తూ రక్షణ కల్పిస్తాయని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా, కరోనా సోకిన 25మంది రోగులను పరిగణలోకి తీసుకున్నారు. వైరస్‌ సోకిన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకూ దాదాపు 36సార్లు వారినుంచి రక్త నమూనాలను తీసుకొని విశ్లేషించారు. వైరస్‌ సోకిన తర్వాత 20వ రోజు నుంచి వారిలో యాంటీబాడీలు క్షీణించిపోతున్నట్లు గుర్తించారు. అయితే, అందరిలోనూ వైరస్‌లో ఉండే స్పైక్‌ ప్రోటీన్‌తో పాటు న్యూక్లియోక్యాప్సైడ్‌ ప్రోటీన్‌ను మెమొరీ బీ కణాలు గుర్తు పెట్టుకుంటున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా వైరస్‌ సోకిన ఎనిమిది నెలల తర్వాత కూడా బీ కణాలు స్థిరంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

వ్యాక్సిన్‌ సమర్థతపై తాజా ఫలితాలు ఎంతో భరోసా కలిగిస్తున్నాయని, వైరస్‌ రీ-ఇన్ఫెక్షన్లకు గల కారణాలను కూడా శాస్త్రవేత్తలు ఈ నివేదికలో పేర్కొన్నారు. తాజా ఫలితాలు ఎంతో ముఖ్యమైనవని.. ఎందుకంటే, వైరస్‌ సోకిన వ్యక్తులు నిజంగానే వ్యాధిపై పోరాడే రోగనిరోధక శక్తిని కలిగివుంటారని పరిశోధనలో పాల్గొన్న మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు మెన్నో వ్యాన్‌ జెల్మ్‌ వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వల్ల దీర్ఘకాలిక రక్షణ కలుగుతుందనే భరోసాను తాజా ఫలితాలు వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..
‘యాంటీబాడీలు తగ్గిపోతాయనడం తొందరపాటే’
వచ్చేవారం ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతి?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని