కరోనా టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌? మంచిదేనట! - Covid vaccine roll out questions answered
close
Updated : 17/12/2020 19:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌? మంచిదేనట!

అమెరికా నిపుణులు ఏమంటున్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారిపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న పోరాటం విజయవంతమయ్యే దిశగా సాగుతోంది. కొవిడ్‌కు ముగింపు పలికే ప్రయత్నాల్లో భాగంగా.. బ్రిటన్‌, అమెరికా, కెనడా దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాయి. బహ్రయిన్‌, పనామా, జర్మనీ తదితర దేశాల్లో ఈ సన్నాహాలు ఊపందుకున్నాయి. అమెరికా, కెనడాల్లో టీకా భద్రతపై నమ్మకం కలిగించేందుకు ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, నేతలు దీనిని బహిరంగంగా తీసుకుంటున్నారు. ఐతే బ్రిటన్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇద్దరికి, అమెరికాలో ఒకరికి అలెర్జీ సమస్యలు రావడంతో.. ప్రజల్లో  సాధారణ భయాందోళనలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అనుమానాలకు అమెరికా వైద్య నిపుణులు ఈ విధంగా వివరణ ఇచ్చారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది?

ఫైజర్‌, మోడెర్నా లేదా ఏ  కొవిడ్‌ టీకా తీసుకున్నప్పుడైనా తొలుత ఒంట్లో కాస్త అసౌకర్యం కలుగుతుంది.  వ్యాక్సిన్‌ ఇచ్చిన చేయి నొప్పి, ఫ్లూ మాదిరి జ్వరం, అలసట, నొప్పులు, చలి, తలనొప్పి అనే ఈ లక్షణాలు ఇతర వ్యాక్సిన్‌ మాదిరిగానే ఉంటాయి. అవి ఇంచుమించు ఒక్క రోజు మాత్రమే ఉంటాయి.  అయితే ఈ లక్షణాలు కొవిడ్‌ సోకిన తొలినాళ్లలో ఉండే మాదిరిగా ఉంటాయని.. కంగారు పడనవసరం లేదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇవన్నీ మీ వ్యాధినిరోధక వ్యవస్థ చక్కగా స్పందిస్తోందనేందుకు నిదర్శనాలే అని స్పష్టం చేశారు.

దుష్పరిణామాల సంగతేంటి?

తమ దేశంలో జరిగిన రెండు రకాల వ్యాక్సిన్‌ ప్రయోగాల నిర్వహణలో గణనీయమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) స్పష్టం చేసింది. బ్రిటన్‌ విషయంలో.. బాధితులకు ఇదివరకే అలర్జీ సమస్యలు ఉన్నట్టు తెలియవచ్చింది.  ఇక అలర్జీ తలెత్తిన అమెరికా మహిళ ఒక్క రోజులోనే  కోలుకున్నారని అలాస్కా ఆస్పత్రి నిపుణులు తెలిపారు. అలర్జీలను గురించిన వివరాలను గురించి ప్రశ్నించిన తర్వాతనే టీకా ఇస్తారు. ఇక వ్యాక్సిన్‌పై ఉండే మూలపదార్ధాల జాబితాను గమనించాలని.. లేదా ఆరోగ్య కార్యకర్తలను అడిగి తెలుసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.  వాటిలో తమకు సరిపడనివి ఉంటే వ్యాక్సిన్‌ తీసుకోవద్దని అంటున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం అలర్జీ ఉన్నవారు కనీసం అరగంట, సాధారణ వ్యక్తులు కనీసం 15 నిముషాలు అదే   పరిసరాల్లో వేచి ఉండాలని వారు వెల్లడించారు. తద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎదుర్కోవటం సులభమౌతుందన్నారు.

ఇతర ప్రమాదాలు తలెత్తితే?

ప్రస్తుత పరిస్థితుల్లో దుష్ఫలితాలు తలెత్తడం కొవిడ్‌ టీకా వల్లనా లేదా యాదృచ్చికమా అనే విషయాన్ని కనుగొనటం పెద్ద సవాలు. అయితే చిన్న చిన్న సమస్యలకు టీకానే కారణమనే నిర్ణయానికి రావద్దని అమెరికన్‌ వైద్యారోగ్య నిపుణులు నొక్కి చెపుతున్నారు. ప్రజల్లో మామూలుగా కూడా అదే విధమైన సమస్యలు తలెత్తుతున్నాయి. బీమా క్లెయింల గణాంకాలు, దుష్పభావాల నివేదికలను పోల్చి చూడటం ద్వారా  ఈ విషయం స్పష్టమౌతోందని ఎఫ్‌డీఏ అధికారులు అంటున్నారు. 

భారత్‌ సంగతేంటంటే..

ఇక భారత్‌ విషయానికి వస్తే అత్యవసర పరిస్థితిలో టీకా వినియోగానికి ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. సదరు అనుమతులు రాగానే భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు కాగలదని భావిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే ఇది సుసాధ్యం కానుందని పరిశీలకులు అంటున్నారు. తొలివిడతగా 30 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కరోనా టీకా వేసినప్పుడు ప్రతిచర్యలు అతి సాధారణమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించాలని నిపుణులు అంటున్నారు. తొలివిడత పంపిణీలో తలెత్తిన ప్రతిచర్యలకు సంబంధించిన అనుభవం.. సాధారణ ప్రజలకు టీకా ఇచ్చే సందర్భాల్లో ఉపయోగపడగలదని వారువెల్లడించారు.

చివరిగా.. మహమ్మారిపై విజయం సాధించే ప్రక్రియలో టీకా వల్ల వచ్చే సాధారణ సమస్యలు, లాభాలను సమన్వయం చేయటం అవసరమని అమెరికా ప్రభుత్వ సంస్థ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) వైద్య నిపుణులు డాక్టర్‌ జే బట్లర్‌ అన్నారు.

ఇవీ చదవండి

కొవిడ్‌ వ్యాప్తికి 180 రోజుల్లో అడ్డుకట్ట

 బైడెన్‌కు వచ్చే వారం.. ట్రంప్‌కు రేపే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని