రైతులతో చర్చలు జరపనున్న రాజ్‌నాథ్‌? - Rajnath may lead discussions with farmers
close
Published : 01/12/2020 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతులతో చర్చలు జరపనున్న రాజ్‌నాథ్‌?

ఆరో రోజూ కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన

దిల్లీ: దిల్లీలో ఆందోళనకు దిగిన రైతులు ఇంకా తమ పట్టువీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. నేడు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రైతు సంఘాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వారితో చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతకుముందు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో రాజ్‌నాథ్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సమావేశం జరిగితే.. 48 గంటల్లో కేంద్ర మంత్రులు ఈ విషయంపై భేటీ కావడం ఇది రెండోసారి అవుతుంది. దీన్ని బట్టి రైతుల ఆందోళనను కేంద్రం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం హాజరుకావాల్సిన ‘బోర్డర్‌ రైజింగ్‌ డే’ కార్యక్రమాన్ని అమిత్‌ షా రద్దు చేసుకున్నారు.

అయితే, ఈ చర్చల్లో పాల్గొనేది లేదని పంజాబ్‌ కిసాన్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సుఖ్వీందర్‌ ఎస్‌ సభ్రన్‌ తెలిపారు. ఆందోళనలో మొత్తం 500 రైతు సంఘాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం 32 సంఘాలనే చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. అన్ని సంఘాల్నీ చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.

సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నిరసన ప్రదర్శన ఇంకా కొనసాగుతుండడంతో ఆయా రహదారులపై వాహనాల రాకపోకల్ని నిషేధించారు. మరికొన్ని రహదారుల్లో వాహనాల్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ భారీ ఎత్తున స్తంభించిపోయింది. మరోవైపు ఆందోళనల్లో మరింత మంది రైతులు వచ్చి చేరుతున్నారు. దీంతో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

రైతుల ఆవేదనను ఆలకించండి..

ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదననకు వినాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. వారితో చర్చించి ఆమోదనీయమైన పరిష్కారానికి రావాలన్నారు. ‘‘రైతులకు మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. అన్నదాతల ఆవేదనను ఆలకించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. యావత్తు దేశం ఈ విషయంపై ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులే ఈ దేశానికి జీవనాధారం’’ అని విజయన్‌ ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని