అమ్మ కడుపులోనే
close
Updated : 29/09/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ కడుపులోనే

ఆధునిక సమాజంలోనూ ఆగని వివక్ష

తగ్గుతున్న ఆడపిల్లల నిష్పత్తి

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

జిల్లాలోని ఓ ఏజెన్సీ మండలానికి చెందిన దంపతులకు తొలికాన్పులో అమ్మాయి పుట్టింది. రెండో బిడ్డ కోసం చేసిన ప్రయత్నం ఫలించడంతో ఓ ఆర్‌ఎంపీ సాయంతో పక్క జిల్లాలోని డయాగ్నస్టిక్‌ కేంద్రానికి వెళ్లి పాప, బాబు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కడుపులో ఆడపిండం ఉందని తెలిసి జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల గర్భస్రావం చేయించారు.

నగర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మగ సంతానం కోసం మరో బిడ్డను కనేందుకు సిద్ధమయ్యారు. భార్య గర్భం దాల్చిన కొన్ని నెలలకు ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి కడుపులో పెరుగుతున్న శిశువు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు సాయం కోరారు. దీంతో ఆయన ఓ డయాగ్నస్టిక్‌ కేంద్రానికి తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించి ఆడపిల్ల పుట్టబోతుందని చెప్పాడు.  దంపతులిద్దరూ కడుపులోనే శిశువును తొలగించుకునేందుకు ఒడిగట్టారు.

బేటీ బచావో.. బేటీ పఢావో నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. అమ్మ కడుపులో ఆడపిల్ల ఉందని తెలియగానే కొందరు నిరాశ చెందుతున్నారు. ప్రపంచాన్ని చూడకముందే కడతేర్చేందుకు ఒడిగడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా నెలకొల్పిన కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు భ్రూణ హత్యలకు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. ఇవి లింగనిష్పత్తిలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణభూతమవుతున్నాయి. చట్టాలను అతిక్రమించి ఆస్పత్రుల్లో జరుగుతున్న దారుణాలను అరికట్టే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.

బహిర్గతం చేయడం చట్టరిత్యా నేరం

పుట్టబోయే బిడ్డ ఆడా? మగా? అనే విషయాలను బహిర్గతం చేయడం చట్టరిత్యా నేరం. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల అమలు అంశాలను తెలియజేసేందుకు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోర్డులు ప్రదర్శించాలి. గర్భస్త శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, భ్రూణహత్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునే వీలుంది.

అతిక్రమిస్తున్న ఆస్పత్రులు

జిల్లాలో కొన్ని ఆస్పత్రులు ఈ నియమాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో వైరారోడ్డు, పాత రైతుబజార్‌, మయూరిసెంటర్‌ ప్రాంతాల్లో ఒకటీ రెండు ఆస్పత్రుల్లో నిబంధనలను అతిక్రమిస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వైద్యరంగంతో సంబంధం లేకుండా వాటిని నెలకొల్పిన యాజమాన్యం కాసులకు కక్కుర్తిపడి ఆర్‌ఎంపీల మధ్యవర్తిత్వంతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.

అధికార యంత్రాంగం వైఫల్యం

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణ హత్యలను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఖమ్మం మయూరిసెంటర్‌లో అధికారులు దాడులు చేసి మూడు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. గడిచిన రెండేళ్ల కాలంలో అధికార యంత్రాంగం కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమై ఈ విషయాలను పట్టించుకోలేదు. ఈ కాలంలో వైద్యరంగంతో సంబంధం ఉన్న కొందరు అక్రమ సంపాదన కోసం భ్రూణ హత్యలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం : డాక్టర్‌ మాలతి, డీఎంహెచ్‌వో

భ్రూణహత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. నిబంధనల అమలుపై ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్న మాట నిజమే. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. నిబంధనల అమలు కోసం నర్సింగ్‌ హోంలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు చేపడతాం.

మూడేళ్లలో జన్మించిన పిల్లల వివరాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో..  ప్రైవేటు ఆస్పత్రులు

ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి

2019-20 986

2020-21 984


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని