గ్రామీణ స్థానిక ఎన్నికల్లో వేఢీ
close
Published : 29/09/2021 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామీణ స్థానిక ఎన్నికల్లో వేఢీ

● 23,998 పదవులకు 79,433 మంది పోటీ

● ఊపందుకున్న ప్రచారం

ఈనాడు డిజిటల్‌, చెన్నై  : రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో జరుగనున్న గ్రామీణ స్థానిక ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. గత ఏడాది అక్టోబర్‌లో 29 జిల్లాల్లో ఈ ఎన్నికలు పూర్తి అయ్యాయి. పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో కాంచీపురం, చెంగల్‌పట్టు, వేలూర్‌, రాణిపేట, తిరుపత్తూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 6, 9వ తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ జరగనుంది. తేదీ దగ్గరపడటంతో ఎన్నికల ప్రచారంలో పార్టీల ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు. అన్నాడీఎంకే నుంచి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి జిల్లాలకు వెళ్లి పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రచారంలోకి దిగారు. నామ్‌ తమిళర్‌ పార్టీ నుంచి సీమాన్‌, అధికార డీఎంకే నుంచి పొన్ముడి సహా పలువురు మంత్రులు ప్రచారం ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ఇచ్చిన హామీల అమలు ప్రచారంలో కేంద్ర బిందువుగా మారింది. 500కుపైగా హామీలు ఇచ్చిన డీఎంకే ముఖ్యమైన వాటిని నెరవేర్చలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. సీఎం స్టాలిన్‌ ప్రకటించినట్లు అమలు చేసిన 200కుపైగా హామీలు నెరవేర్చామని, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశామని డీఎంకే నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పలువురు అభ్యర్థులను పోటీ నుంచి వైదొలగాలని బెదిరిస్తున్నట్లు నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎంఎన్‌ఎం, అన్నాడీఎంకే ఆరోపణలు గుప్పించాయి. ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని కోవూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకే తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, తమ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించేలా చేస్తున్నట్లు ఆరోపించారు. భరణిపుదూర్‌ చేరుకున్న కమల్‌హాసన్‌ అక్కడి శ్మశానం దుస్థితి చూపించి స్థానికంగా పరిస్థితి ఇలా ఉందని విమర్శించారు. సేలం జిల్లా పణమరత్తుపట్టిలో తమ పార్టీ అభ్యర్థిని బెదిరించి నామినేషన్‌ ఉపసంహరించేట్లు చేశారని ఎంఎన్‌ఎం నాయకులు ఆరోపిస్తున్నారు.

హామీలపై పరస్పర విమర్శలు

ముఖ్యంగా డీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నాడీఎంకే వంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చిన్న హామీలు 25శాతం మాత్రమే నెరవేర్చారని పేర్కొంటున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల గురించి డీఎంకే నాయకులు మాట్లాడుతూ.. ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ప్రజల్లో ఆదరణ కోసం మాత్రమే ప్రతిపక్షాలు ఇలా పాకులాడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9 జిల్లాల ఎన్నికల్లో డీఎంకే ఎవరినీ పోటీ చేయనీయడం లేదని పేర్కొనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. నాలుగు నెలలలుగా డీఎంకే పాలనతో ప్రతిపక్షాలకు రాష్ట్రంలో ఏ మాత్రం స్థానం లేని స్థితి నెలకొందని చెబుతున్నారు.

2,981 మంది ఏకగ్రీవం

ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. మొత్తం 97,831 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవికి - 72,071, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు - 15,967, పంచాయతీ యూనియన్‌ వార్డు మెంబర్‌ - 8,671, జిల్లా పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు 1,112 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పదవులకు సంబంధించి 2,981 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఉపసంహరణలు పోగా 23,998 పదవులకు 79,433 మంది బరిలో ఉన్నట్లు తెలిపింది. 2 గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవులకు, 21 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్‌ దాఖలు కాలేదని తెలిపింది. మొత్తం 27,003 పదవులు ఉండగా కోర్టు ఉత్తర్వుల కారణంగా శ్రీపెరంబదూర్‌ పంచాయతీ యూనియన్‌లో ఓ పదవికి ఎన్నికలు నిలిపేశారు. దాఖలైన మొత్తం నామినేషన్లలో 1,166 తిరస్కరణకు గురికాగా, 14,751 ఉపసంహరించుకున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని