కరోనారోగుల దుస్థితి.. వీడియో షేర్‌చేసిన భజ్జీ - harbhajan tweets heart wrenching video of corona patients
close
Published : 14/04/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనారోగుల దుస్థితి.. వీడియో షేర్‌చేసిన భజ్జీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో పడకలు చాలట్లేదు. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొవిడ్‌ రోగుల దుస్థితిని తెలియజేస్తూ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన హృదయవిదారక వీడియోలు దేశంలో మహమ్మారి తీవ్రతకు అద్దంపడుతున్నాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రి కరోనా రోగులతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలో బెడ్‌లు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి రోగులు బయటే ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులతో ఉన్న 108 వాహనాలు ఆసుపత్రి ముందు బారులు తీరిన వీడియోను భజ్జీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘బాధాకరమైన నిజం. దేవుడా.. దయచేసి అందర్నీ కాపాడు’’ అని హర్భజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోనూ చాలా నగరాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడటంతో కరోనా రోగులను ఆసుపత్రి బయట ప్రైవేటు వాహనాల్లో ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. 

మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. 15 రోజుల పాటు లాక్‌డౌన్ తరహా కఠిన నిబంధనలు అమలు చేయనుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని