మాట్లాడకుండా తినండి: క్యోటో ప్రచారం - kyoto city argued people eat silently
close
Updated : 22/02/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాట్లాడకుండా తినండి: క్యోటో ప్రచారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబసభ్యులు, స్నేహితులతో రెస్టారంట్‌కు ఎందుకు వెళ్తాం? సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికే కదా! కానీ, జపాన్‌ ప్రభుత్వం మాత్రం ప్రజలు రెస్టారంట్లకు వెళితే.. ఎవరు ఏమీ మాట్లాడకుండా తినేసి బయటకు రావాలని సూచిస్తుంది. ‘సైలెంట్‌ ఈటింగ్‌’ పేరుతో ఈ నిబంధన తీసుకొచ్చింది. దీనిపై ప్రచారం నిమిత్తం ఇటీవల పోస్టర్లు కూడా విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే...

జపాన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలలపాటు రెస్టారంట్లు మూతపడగా.. ఈ మధ్యే తిరిగి తెరుచుకున్నాయి. ఈ రెస్టారంట్ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఎందుకంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా సోకుతుందన్న విషయం తెలిసిందే. రోజంతా మాస్కులు ధరించే వ్యక్తులు తినే సమయంలోనే మాస్కులు తీసేస్తారు. తింటూ మాట్లాడుతున్నప్పుడు కరోనా వైరస్‌ గాల్లోకి చేరి ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, కరోనా కట్టడిలో భాగంగా రాత్రి 8 గంటలకే రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, రెస్టారంట్లకు వెళ్లే ప్రజలు తినే సమయంలో మాట్లాడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కాగా.. క్యోటో నగరం మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘సైలెంట్‌ ఈటింగ్‌’పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా నాలుగు కార్టూన్లతో పోస్టర్‌ రూపొందించింది. 

అందులో రెస్టారంట్‌కు వచ్చిన ఒక బాలుడు అక్కడ ఒక కుటుంబం తినే సమయంలో మాట్లాడకుండా కేవలం సంజ్ఞలు చేసుకోవడం చూస్తాడు. వారి ప్రవర్తన గమనించాక తినే సమయంలో మాట్లాడకూడదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత రెస్టారంట్‌ సిబ్బందితో పెదవి విప్పకుండా భోజనం బాగుందని చేతులతో సంజ్ఞ చేస్తాడు. ఆ కుటుంబం రెస్టారంట్‌ బయటకు రాగానే భోజనం బాగుందని మాట్లాడుకుంటారు. అంటే.. రెస్టారంట్‌లో ఉన్నంత సేపు ఎవరూ మాట్లాడకూడదని తెలిపే విధంగా ఆ పోస్టర్లు ఉన్నాయి. క్యోటోలోని రెస్టారంట్లలో ఈ పోస్టర్లను అతికించడం చూసిన ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇలాంటి నిబంధనలు పెడితే.. రెస్టారంట్లకే వెళ్లమని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ ఆలోచన బాగుందని, ప్రజల క్షేమం కోసమే ఈ నిబంధన పెట్టినప్పుడు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. ఏదేమైనా జపాన్‌ ఏం చేసినా.. భిన్నంగా చేస్తుందనడానికి ఇదీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని