100% Vaccinated: వెల్‌డన్‌ మై బాయ్స్‌! - learn from the armed forces as nearly 100 percent personnel vaccinated already
close
Published : 25/04/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100% Vaccinated: వెల్‌డన్‌ మై బాయ్స్‌!

 టీకాలు తీసుకోవడంలో ఆదర్శంగా సాయుధ బలగాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే పది మందికి సాయం చేయవచ్చు...’

- ఈ సూత్రాన్ని భారత సాయుధ బలగాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. క్రమశిక్షణలో తమకు తామే సాటి అని మరోసారి రుజువు చేశాయి. 45 ఏళ్లు పైబడిన వారికి, అత్యవసర సేవలందించే వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తోంది. కానీ, చాలా మంది లేనిపోని అపోహలు, మూఢనమ్మకాలతో టీకాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భారత సాయుధ బలగాలు టీకాలు వేయించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. కరోనా నుంచి టీకా రక్షణ లభించిందే తడవుగా బాధితులకు అత్యవసర సేవలు అందించేందుకు రంగంలోకి దిగాయి. 

భారత సాయుధ బలగాలకు టీకాలు అందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే 97 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 78 శాతం మంది రెండో డోసు టీకా తీసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిలో కోస్ట్‌ గార్డ్‌, బోర్డర్ రోడ్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది ఉన్నారు. 

త్రివిధ దళాల్లో ఇలా..

* సైన్యంలోని 13 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 99 శాతం మందికి తొలి డోసు ఇచ్చేశారు. రెండో డోసు 82 శాతం మందికి పూర్తి చేశారు. 

* వాయుసేనలోని రెండు లక్షల మంది ఉండగా.. వంద శాతం మంది తొలి డోసు అందుకున్నారు. 90 శాతం మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు.

* సుమారు లక్ష మంది ఉన్న నావికాదళంలో దాదాపు వంద శాతం మంది తొలి డోసు టీకా తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది రెండో డోసు పూర్తి చేశారు.

బయట ప్రదేల్లో ఉండిపోయిన అతి కొద్దిమంది సభ్యులకు త్వరలోనే టీకాలు ఇవ్వనున్నారు. త్రివిధ దళాల్లో టీకాలు తీసుకున్న వారిలో ఎటువంటి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. 

44 వేల మందికి కొవిడ్‌..

టీకాలు రాక ముందు దాదాపు త్రివిధ దళాలు, బీఆర్‌వో సిబ్బంది, కోస్ట్‌గార్డ్‌లో మొత్తం 44 వేలమంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం వీరిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పరిగణించి వయసుతో సంబంధం లేకుండా సర్వీస్ ఆస్పత్రుల్లో టీకాలు వేసింది. దీని కోసం కొవిషీల్డ్‌ టీకాను వాడింది. దీంతోపాటు చాలామంది వెటరన్స్‌కు టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టింది. 

రంగంలోకి దళాలు..

తాజాగా దేశంలో పరిస్థితులు చేజారిపోవడంతో దళాలు రంగంలోకి దిగాయి. సైనిక ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, అవసరమైన నగరాలకు సైనిక వైద్యులను పంపించారు. దీంతోపాటు దిల్లీ వంటి ప్రాంతాలకు ప్రాణవాయువు, అవసరమైన ఔషధాల సరఫరాలో దళాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. 

ఇప్పటివరకు కొవిడ్‌ చికిత్సకు అత్యవసర సామగ్రి సరఫరాలో వాయుసేన చురుగ్గా వ్యవహరిస్తోంది. ఖాళీ ఆక్సిజన్‌ ట్యాంకర్లు వేగంగా ఫ్యాక్టరీల వద్దకు చేర్చడంలో సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు.. సింగపూర్‌ నుంచి క్రయోజనిక్‌ కంటైనర్లను తరలించడంలోనూ ముందు నిలిచింది. వాస్తవానికి అత్యవసరమైతే ఆక్సిజన్‌ నింపిన కంటైనర్లను తరలించడానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, వేగంగా మండే స్వభావం కలిగిన ఆక్సిజన్‌ను విమానాల్లో తరలించడం సాంకేతికంగా అత్యంత ప్రమాదకరం. అందుకే ఇప్పటివరకు ఆ చర్యలను చేపట్టలేదు. దీంతోపాటు ద్వీపాలు, మారుమూల ప్రాంతాలకు కొవిడ్‌ పరీక్షల కిట్లు, నమూనాలను తరలించడానికి సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ పనిచేసింది. 

ప్రస్తుతం వాయుసేన వద్ద ఒక్కోటి 70 టన్నుల బరువు మోసే సీ-17గ్లోబ్‌ మాస్టర్‌ విమానాలు 11 ఉండగా, 40 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉన్న ఐఎల్‌-76 విమానాలు 11 ఉన్నాయి. అంతేకాకుండా సీ-130 సూపర్‌ హెర్క్యూలెస్‌ విమానాలు 12, ఏఎన్‌-32 విమానాలు 90 ఉన్నాయి. వీటికి అదనంగా చినోక్‌ హెలికాప్టర్లూ అందుబాటులో ఉన్నాయి. 

సైన్యం సర్వం సిద్ధం: లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మొహంతి

భారత సైన్యం రవాణ సాధనాలతో ఇప్పటికే రంగంలోకి దిగింది. కొవిడ్‌ సేవల్లో సైన్యం పాత్రపై లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మొహంతి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘వైద్యమౌలిక వసతులు, వైద్యానికి అవసరమైన వనరుల సమీకరణ, సిబ్బంది, పరికరాల సమకూర్చే విషయంలో భారత సైన్యం కృషి చేస్తుంది. పౌర సేవల్లో లాజిస్టిక్స్‌, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ కొంచెం క్లిష్టమైనవి’’ అని చెప్పారు. అంతేకాదు త్రివిధ దళాలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరమూ ఉందన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని