MAA Elections: ‘మా’ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? గెలిస్తే చేయాల్సిన పనులేంటి? - what is maa elections and how it is going on
close
Updated : 09/10/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? గెలిస్తే చేయాల్సిన పనులేంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల పోలింగ్‌కు (MAA Elections) మరి కొద్ది గంటల సమయమే ఉంది. అటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, ఇటు మంచు విష్ణు ప్యానెల్‌ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచార పర్వం వాడీవేడీగా సాగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఇరు ప్యానెల్స్‌ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ‘మా’ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? ఎన్నికైన కార్యవర్గం ఏం చేస్తుంది?...తదితర వివరాలను తెలుసుకుందాం.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) కార్యవర్గాన్ని రెండేళ్లకొకసారి ఎన్నుకుంటారు. ఇందులో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్​ప్రెసిడెంట్​, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందితో అసోసియేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. వీరందరిని ఎన్నుకునేందుకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

‘మా’లో ఓటింగ్‌ ఇలా జరుగుతుంది!

‘మా’ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో ఓటరు మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోటీ పడుతున్న ప్యానెల్ సభ్యుల్లో తమకు నచ్చిన అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఈసీ సభ్యులకు ఓటు వేయాలి. అంటే ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానెల్‌లో ఉన్నాడు, ఏ పదవికి పోటీ చేస్తున్నాడో చూసి ఓటు వేయాలి. ఈ క్రమంలో రెండు ప్యానెల్స్ మధ్య పోటీ జరిగితే ఓటరు ఎలాంటి గందరగోళం ఉండదు. రెండు కంటే ఎక్కువ ప్యానెల్స్ పోటీ చేస్తే ఓటరు గందరగోళంలో పడతారు.  (ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌ మాత్రమే పోటీ పడుతున్నాయి) 2015లో అసోసియేషన్ ఎన్నికలను ప్రయోగాత్మకంగా ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నారు.

‘మా’ అధ్యక్షుడు అవుతారిలా...

‘మా’ అసోసియేషన్‌లో 26 మంది కార్యవర్గ సభ్యుల కోసం జరిగే ఓటింగ్‌లో ఒక్కో ఓటరు 26 ఓట్లను వేయాలి. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడైనా, ఈసీ సభ్యుడైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది. ఎన్నికల్లో రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో ఉండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒకే ప్యానెల్‌గా మారుతారు. అధ్యక్షుడిగా ఎవరైతే విజేతగా నిలుస్తారో అతని ఆధ్వర్యంలో మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఒకే ప్యానెల్ విజయం సాధించటం చాలా కష్టం.

గత మూడు ఎన్నికల్లో ఏం జరిగింది?

2015లో సాధారణ ఎన్నికలను తలపించేలా రాజేంద్రప్రసాద్, నటి జయసుధ మధ్య జరిగిన పోటీలో రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 702 మంది సభ్యుల్లో 394 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఫలితాల వెల్లడిపై కోర్టు స్టే ఇచ్చింది. మూడు రోజుల తర్వాత వెలువడిన ఫలితాల్లో రాజేంద్రప్రసాద్‌కు 237 ఓట్లు రాగా జయసుధ 152 ఓట్లు సాధించారు. 85 ఓట్ల మెజార్టీతో 2015లో ‘మా’ అధ్యక్ష పీఠాన్ని రాజేంద్రప్రసాద్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2017-19 ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 783 మంది అసోసియేషన్ సభ్యులు శివాజీరాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా నరేశ్​, జాయింట్ సెక్రటరీగా హేమ, ఏడిద శ్రీరామ్‌లు కూడా ఏకగ్రీవమయ్యారు.

2019లో మళ్లీ పోటీ ‘మా’ అసోసియేషన్‌లో మళ్లీ ఎలాంటి విభేదాలుండవని భావించిన సినీ పరిశ్రమకు 2019-2021 ఎన్నికలు తారస్థాయికి చేరాయి. గతంలో ఒకే ప్యానెల్‌లో పనిచేసిన శివాజీరాజా, నరేశ్‌లు అధ్యక్ష పదవికి కోసం పోటీపడ్డారు. అసోసియేషన్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే స్థాయికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 745 మంది సభ్యుల్లో 472 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివాజీరాజాకు 199 ఓట్లు రాగా నరేశ్‌కు 268 ఓట్లు వచ్చాయి. 69 ఓట్ల మెజార్టీతో నరేశ్​ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు మరింత ముదిరిన వివాదం

గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. వాడీవేడీగా చర్చలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం సాగింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బరిలో దిగుతున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, హేమ తదితరులు కూడా తాము అధ్యక్ష బరిలో ఉంటామని ప్రకటించారు. ఒకనొకదశలో జీవిత పేరు కూడా వినిపించింది. అయితే, ఆమె నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఐదుగురు అధ్యక్ష పోటీలో ఉంటారని తెలియగానే సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరిగింది. ఎన్నికల్లో తాను అధ్యక్ష పోటీలో లేనని జీవిత ప్రకటించగా, హేమ కూడా తప్పుకొని ఇద్దరూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావులు నామినేషన్‌లు సమర్పించారు. అధ్యక్షుడిగా పోటీచేస్తున్న సీవీఎల్‌ తన మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ‘మా’ అధ్యక్ష బరిలో నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించారు. దీంతో త్రిముఖ పోరు కాస్తా.. ద్విముఖ పోరుగా మారింది. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌ మధ్య ప్రచారం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. మంచు విష్ణు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి  సినీ పెద్దలను కలిసి మద్దతు కోరారు. ప్రకాశ్‌రాజ్‌కు నాగబాబు తదితరులు అండగా నిలిచారు.

ప్రస్తుతం ‘మా’ సభ్యులు ఎంతమంది?

‘మా’ఎన్నికలకు ఆదివారం(అక్టోబరు 10) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925మంది సభ్యులు ఉండగా, 883మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రేపు రాత్రికి ‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.

‘మా’ ఎన్నికల్లో గెలిస్తే చేసే విధులు, బాధ్యతలు ఏంటి?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచిన అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులంతా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం పనిచేయాల్సి ఉంటుంది. గత పాలకవర్గం చేపట్టి పనులను కొనసాగిస్తూనే వాటిని మరింత సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. సభ్యుల పింఛన్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌లతోపాటు సభ్యుడు ఎవరైనా చనిపోతే అతని కుటుంబానికి రావల్సిన జీవిత బీమా సొమ్మును దగ్గరుండి ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సభ్యులకు అందుతున్నాయో లేదో చూడాలి. సభ్యులకు సినిమాలో అవకాశాలు కల్పించడం కూడా కార్యవర్గం బాధ్యతల్లో ప్రధానమైనది. సభ్యుల సంక్షేమంతోపాటు సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం, నిర్మాత మండలి, దర్శకుల సంఘంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ఇతర భాష నటీనటుల సంఘాలతో అభిప్రాయభేదాలు లేకుండా చూసుకోవడం ‘మా’ అసోసియేషన్ కార్యవర్గం చేసే పనులు. అసోసియేషన్‌కు నిధులు సమీకరించేందుకు వినోద కార్యక్రమాలు చేపట్టడం కూడా కార్యవర్గం బాధ్యతల్లో ఒకటి. వీటి కోసం అసోసియేషన్ కో-ఆర్డినేషన్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ, యాక్టివిటీస్ కమిటీ, ఫండ్ రైజింగ్ కమిటీ, విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఉండే సభ్యులంతా వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా అసోసియేషన్‌​ నిర్వహణను రెండేళ్లపాటు విజయవంతంగా కొనసాగించాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని