close
టాలీవుడ్‌
ప్రేమనగర్‌  కోసమే... 

13 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చా!

వాణిశ్రీ... ఈ మూడు అక్షరాలు... మూడు భాషల్లో, దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ ప్రేమికుల్ని ఉర్రూతలూగించాయి. సన్నజాజుల వానలాంటి ఆ నవ్వు, సొగసుకే అర్థం చెప్పే ఆ నడక, వెన్నెల వాగు లాంటి ఆ వాలుకళ్లు, ఆ కళ్లలో పలికే అసమాన భావాలు... ఆవేశాలు... అన్నీ వేటికవి ప్రత్యేకమే! 
ఆ తరంలో వెండితెర మీద ఆత్మాభిమానం అంటే వాణిశ్రీ... ప్రేమానురాగాలంటే వాణిశ్రీ... ఒక రకంగా చెప్పాలంటే నుదుట పెట్టుకునే బొట్టు నుంచి, చీర కట్టు వరకూ ఈ ‘నవలా నాయిక’ ఏం చేస్తే అది అనుసరించేవారు ఆడపిల్లలంతా. 
రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకుని, చలన చిత్రసీమలో తనదైన అధ్యాయం లిఖించుకున్న వాణిశ్రీ... తొలిసారిగా ఇప్పుడు చిన్నితెరపై తన నట వైభవాన్ని చూపించబోతున్నారు. 
ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచి, తెలుగువారి మనసుల్ని  గెలుచుకున్న ‘ఈటీవీ’, సరికొత్తగా ప్రారంభిస్తున్న ‘ప్రేమనగర్‌’ ధారావాహికలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వాణిశ్రీ. 
70 సంవత్సరాల వయసులోనూ ఆమె నటనలో అదే ఠీవి, అదే గర్వం, అదే సాధికార స్వరం... 
ఈ నెల 15 సోమవారం నుంచి ఈటీవీలో రోజూ సాయంత్రం గం. 6.30కు ప్రసారం కాబోతున్న  ‘ప్రేమనగర్‌’ సీరియల్‌ని ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మిస్తోంది. 1971లో విడుదలై ఘన విజయం సాధించిన ‘ప్రేమ్‌నగర్‌’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీలే హీరోహీరోయిన్లు కావడం విశేషం. అపురూపమైన ఈ సందర్భంలో వాణిశ్రీతో ముచ్చటించి ఆమె మనోభావాల్ని తెలుసుకుంది ఈనాడు సినిమా. 
తొలిసారి బుల్లితెర కోసం కెమెరా ముందుకు రావడం ఎలా ఉంది? 
ఎక్కడైనా నటనే కదండీ. కొత్తగా ఏమీ లేదు కానీ... టెలివిజన్‌  ధారావాహికలు ఎలా చేస్తారనేది ఇదివరకు నాకు తెలియదు. తొలిరోజు సెట్‌కి వెళ్లగానే ఆ విషయాలన్నీ గమనించా. అలాగే కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లున్న పాత్రని కూడా ఇదివరకెప్పుడూ చేయలేదు. ‘ప్రేమనగర్‌’ ధారావాహిక వల్ల ఆ అవకాశం లభించింది. 
మీ ‘ప్రేమనగర్‌’ చిత్రానికీ, ఈ ధారావాహికకీ సంబంధమేమైనా ఉందా? 
‘ప్రేమనగర్‌’ అనే పేరు తప్ప మరే సంబంధం లేదు. సినిమాలో నేను లత పాత్రలో కనిపిస్తా. ఇందులో రాజ్యలక్ష్మిదేవిగా కనిపిస్తా. ఇప్పుడు నా వయసుకు తగ్గ పాత్రలోనే నటిస్తున్నా. ధారావాహిక చాలా సందడిగా సాగుతూ, ఇంటిల్లిపాదికీ చక్కటి వినోదాన్ని పంచుతుంది. 
ఇదివరకు ధారావాహికల కోసం మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? 
సినిమాలతో పాటు ధారావాహికల కోసం కూడా తరచుగా ఎవరో ఒకరు సంప్రదిస్తూనే ఉంటారు. మీ అనుభవానికి ఎలాంటి భంగం కలగకుండా, మీరు కోరుకొన్న సౌకర్యాలన్నీ కల్పిస్తాం, మీరు నటించండంటూ వచ్చారు. కానీ నేను చేయలేదు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మా తరం వేరు, ఈతరం వేరు. నాకు తెలిసిన దర్శకుడో, నిర్మాతో, సాంకేతిక నిపుణుడో ఉంటే తప్ప చేయలేనని చెబుతుంటా. మంజులానాయుడు, సుహాసిని, ఖుష్బూ... ఇలా చాలామంది వచ్చి ‘మీరు చేయాలమ్మా’ అని అడిగారు. కానీ చేయలేకపోయా. ఇందులో మాత్రం నా వయసుకు తగ్గ పాత్ర కావడం, ఈటీవీ, అన్నపూర్ణ సంస్థలతో నాకు మంచి అనుబంధం ఉండటంతో చేయడానికి ఒప్పుకొన్నా. దర్శకుడు వర కూడా బాపు రమణ స్కూల్‌ నుంచి వచ్చినవాడు. మా అమ్మాయి, కొందరు శ్రేయోభిలాషులు ‘బాగుంటుందమ్మా చెయ్యండి, నీక్కూడా కాస్త రిలాక్సేషన్‌గా ఉంటుంది’ అన్నారు. దాంతో 13 ఏళ్ల తర్వాత ‘ప్రేమనగర్‌’ కోసమే కెమెరా ముందుకొచ్చా. 
సినిమా వాతావరణానికి దూరంగా ఈ 13 ఏళ్లు ఎలా గడిపారు? 
వృత్తి వేరు, జీవితం వేరనుకొనే మనస్తత్వం నాది. సినిమాలకి దూరమయ్యాక నా బిడ్డలు, వాళ్ల భవిష్యత్తు, నేను, నా జీవితం అంతే. మంచి పాత్రలు వచ్చినంతవరకు చేశాను. వచ్చిన పేరును పాడు చేసుకోకుండా కాపాడుకుంటే చాలనే ధోరణిలో ప్రయాణించా. నృత్యంలో నాకు మంచి పట్టుంది. కథక్‌, మణిపురి, భరతనాట్యం, కూచిపూడి తెలుసు. అదే కాకుండా సినిమాకి సంబంధించి నాకు అన్ని విషయాలపైనా అవగాహన ఉంది. కానీ నటన తప్ప మరోవైపు వెళ్లలేదు. కథలు రాయడం చిన్నప్పట్నుంచీ అలవాటు. కానీ నా భావాల్ని పేపర్‌పై పెట్టడం తప్ప మరోటి చేయలేదు. నాకంటే గొప్పగా రాసేవాళ్లు చాలామంది ఉన్నారనుకొన్నా. నృత్య దర్శకత్వం కూడా చేయొచ్చు కానీ చేయలేదు. అక్కినేని నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. మీరు మాటలు రాయొచ్చు కదా అని ఆయనతో అంటే ‘ఎందుకు వాణిశ్రీ... మనకంటే బాగా రాసేవాళ్లున్నప్పుడు. అన్నింట్లోనూ మన పేరే ఉండాని ఎందుకనుకోవాలి’ అనేవారు. శోభన్‌బాబు కూడా అంతే. ఆ మాటలు నాలో బాగా నాటుకుపోయాయి. ఎన్టీఆర్‌ కూడా ఆయన సొంతానికి దర్శకత్వం చేసుకొన్నారు కానీ, బయటి వాళ్లకి చేయలేదు. కె.బాలచందర్‌, పుట్టనకనగల్‌, శాంతారామ్‌, గిరీష్‌కర్నాడ్‌ తదితర దర్శకుల్ని చూశాక ‘మనమేంటి దర్శకత్వం చేయడమేంటి’ అనిపించింది. నాకు తెలిసింది నటనొక్కటే కాబట్టి చక్కగా అలంకరించుకోవడం, నాజూగ్గా ఉండేలా చూసుకోవడం, కెమెరా ముందుకు రావడం.. అంతవరకే చూసుకునేదాన్ని. సెట్‌లో నా అంత నాజూగ్గా, నా అంత అందంగా మరొకరు ఉండకూడదు అనుకొనేదాన్ని. తెల్లగా ఉండేవాళ్లు చాలామందే వచ్చారు. కానీ నా ఛాయల్లోకి ఎవ్వరూ రాలేకపోయారు. అది భగవంతుడి ఆశీర్వాదం. మనకంటూ భగవంతుడు ఒకటిస్తాడు. అదేంటన్నది కనిపెట్టి బయటికి తీసుకురావాలంతే. 
ఇన్నేళ్ల తర్వాత చిత్రీకరణలో పాల్గొనడం, ఆ వాతావరణం చూశాక మీ మనసులో కలిగిన ఆలోచనలు? 
మాకు సినిమా అంటే ఒక తపస్సు. సెట్‌లో ఏకాగ్రతతో ఉండేవాళ్లం. అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా ఉండేది. దర్శకుడు యాక్షన్‌ చెప్పబోతున్నాడంటే ఒక గంట మోగేది. ఐదారు సెకన్లు మోగుతుంది ఆ గంట. దాంతో చుట్టుపక్కల ఎక్కడి మనుషులక్కడే, ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయేవి. షాట్‌ పూర్తయ్యాక మళ్లీ ఓ గంట వినిపించేది. అప్పుడు అంతా కదిలేవారు. ఇప్పుడలా లేదు. ధారావాహికలకి ప్రామ్టింగ్‌ ఉంటుంది. ఎప్పుడూ సుప్రభాతంలా సంభాషణలు వెనకాల వినిపిస్తూనే ఉంటాయి. దాంతో ఒకట్రెండు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఆ రోజుల్లో సంభాషణలన్నింటినీ గుర్తు పెట్టుకొని, వాటిని ఎలా చెప్పాలో మననం చేసుకొని అలా హావభావాలకి తగ్గట్టుగా చెప్పేవాళ్లం. కానీ ఇప్పుడు చిత్రీకరణల్లో ఆ వాతావరణం కనిపించడం లేదు.

నవలా చిత్రాల కథానాయికగా పేరు సంపాదించారు. ఆ పాత్రలపై అంత ప్రభావం పడటానికి మీ రూపమే కారణమా? 
రూపంతో పాటు నటన కూడా. ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చక్రవాకం’...ఇలా అప్పట్లో నవలా చిత్రాలు నేను చాలా చేశా. అందుకే నవలా నాయిక అన్నారు నన్ను. స్వతహాగా నాకు నవలలంటే ఎంతో ఇష్టం. వాటిని చదివాక ఓ అభిప్రాయం ఏర్పడేది. అది మనసులో ఉన్నప్పుడు నటనే మారిపోతుంది. అందుకే అప్పట్లో నేను చేసిన నవలా పాత్రలన్నీ విజయవంతమయ్యాయి.

‘ప్రేమనగర్‌’లో రాజ్యలక్ష్మీదేవి పాత్ర కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా సన్నద్ధమయ్యారా? 
నా వయసుకు తగ్గ పాత్రే కాబట్టి ఆ అవసరం రాలేదు. అయితే సినిమాల్లో చూసిన వాణిశ్రీలాగే నాజూగ్గా కనిపిస్తానని, డ్యాన్సులు వేస్తానని మాత్రం ఊహించుకుని టీవీ ముందు కూర్చుంటే పప్పులో కాలేస్తారు. వాణిశ్రీ అమ్మలాగా, వాళ్ల మేనత్తలాగా కనిపిస్తాను. 
సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేసింది మీరే అనే మాట వినిపిస్తుంటుంది. దానిపై మీ అభిప్రాయం? 
చాలా తప్పండీ ఆ మాట. ఆమె చందమామండీ బాబూ. మేమేమో తారలం. మేం మెరుస్తుంటాం తప్ప, ఆమె ఆకాశంలో కనిపించే చందమామ. సినిమా కోసమే ఆమెని దేవుడు సృష్టించాడు. హావభావ  ప్రదర్శనల్లో కానీ, సంభాషణలు చెప్పడంలో కానీ ఆమెకి ఆమే సాటి. భానుమతి, కన్నాంబ, సావిత్రి... వీళ్లని మరొకరితో పోల్చలేం. ఎవరైనా వాళ్ల నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు కానీ, వాళ్లలా అయిపోతామని భావిస్తే అది తప్పు. నేను వచ్చినప్పుడు ట్రెండ్‌ ఎలా ఉండేదో, దాన్ని బట్టే నేను డ్రెస్‌వేసుకొన్నా. చీరలోనే అందంగా కనిపించాలని ప్రయత్నించా. దుస్తులు తగ్గించమంటే మాత్రం ఒప్పుకొనేదాన్ని కాదు. చీర, లంగా, సల్వార్‌, కమీజ్‌. అంతే తప్ప శరీరం బయటకి కనిపిస్తుందేమో అనే భయమేస్తే ఆ సినిమా మానేసేదాన్ని. వాటికి నేను సరిపోను, వేరేవాళ్లు ఉన్నారు కదా అనేదాన్ని. నా రూపంలో భారతీయత ఉట్టి పడాలని పెద్ద బొట్టు పెట్టించుకొనేదాన్ని. అప్పట్లో దర్శకులు కూడా నాతో అలాంటి పాత్రలే చేయించారు. స్వర్ణయుగం ప్రారంభమైనప్పుడు నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు వేరే యుగం ఏదో ఉంది. అప్పుడు సినిమాలోకం అనేవాళ్లు, ఇప్పుడు సినీమాయాలోకం అనాలేమో. అన్నీ చూస్తూ నవ్వుకుంటుంటాం. 
ఇప్పుడొస్తున్న సినిమాలు చూస్తుంటారా? 
ఒక్కటి కూడా వదలకుండా చూస్తుంటా. ఇప్పుడూ బాగా నటిస్తున్నారు. ఆ రోజుల్లో అది ట్రెండ్‌. ఇప్పుడు ఇది ట్రెండ్‌. అనుష్క, నయనతార, సమంత ఇలా.. ఒకొక్కరు ఒక్కో సినిమాలో చాలా బాగా నటిస్తుంటారు. 
సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ చూశారా? అలా మీ జీవితంపై సినిమా చేస్తామని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? 
ఆ సినిమా చూశాను కానీ, సగం నుంచి నిద్రపోయాను. సగం నుంచి నాకు సావిత్రి జీవితం కనిపించలేదు. ఇక నా బయోపిక్‌ విషయానికి వస్తే అదెలా సాధ్యమవుతుంది? సినిమా కథంటే మలుపులు ఉండాలి. నా జీవితంలో అలాంటి మలుపులేమీ లేవు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.