
ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది.
ఎస్ఈసీ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు బుధవారం ఎస్ఈసీని ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం పరిష్కారం అయ్యేంత వరకు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన చేయవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తదుపరి ఉత్తర్వుల మేరకు ఓట్ల లెక్కింపుపై స్పష్టత రానుంది.