Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధర బాగున్నా.. దిగాలే

పసుపు నాణ్యతను దెబ్బతీసిన అధిక వర్షాలు
ఈనాడు, అమరావతి
 
అమ్మకాలకు పసుపు సిద్ధం చేస్తున్న రైతులు

పసుపు రైతులకు ఈఏడాది కోలుకోలేని దెబ్బతగిలింది. ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలు కురవడంతోపాటు ఎక్కువ రోజులు పంట నీటిలో నానడంతో దుంప పుచ్చ, దుంప కుళ్లు తదితర సమస్యలు వచ్చి నాణ్యత తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు దిగజారాయి. ఏటా ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుండగా, ఈఏడాది 20 క్వింటాళ్లకు పడిపోయాయి. ఇందులోనూ పుచ్చు శాతం కొన్ని ప్రాంతాల్లో 40 శాతం దాకా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఈశాతం ఇంకా ఎక్కువగా ఉంది. సాధారణంగా పుచ్చు 20శాతంలోపే ఉంటుండగా ఈసారి బాగా పెరిగింది. ధర బాగున్నా, నాణ్యత దెబ్బతినడంతో తమకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

జిల్లాలో 5వేల హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. కృష్ణానదీ తీర మండలాలైన దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మెట్ట ప్రాంతం సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లోనూ పసుపు సాగు ఉంది. ఈఏడాది అధిక వర్షాలు పడటంతోపాటు కృష్ణానదికి ఎక్కువ రోజులు వరదలు రావడంతో పంట నీట మునిగింది. నేలలో తేమశాతం పెరిగి దుంప కుళ్లి పుచ్చుశాతం పెరిగింది. పసుపు ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి కౌలు రూ.35వేలతోపాటు మరో రూ.65వేలు పెట్టుబడి వెచ్చిస్తున్నారు. ఎకరాకు సగటున రూ.లక్ష చొప్పున వెచ్చిస్తే దిగుబడులు తగ్గడంతో పెట్టిన సొమ్ము కూడా రావడం లేదు. దిగుబడులు ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లలోపే ఉండటం అందులోనూ పుచ్చుశాతం ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అధిక వర్షాలతో దిగుబడులు తగ్గి నష్టపోయామని దుగ్గిరాలకు చెందిన రైతు మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది క్వింటాకు రూ.10వేలు ధర వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు.

నాలుగేళ్లుగా అంతంత మాత్రంగానే ధరలు

గడిచిన నాలుగేళ్లుగా పసుపు ధరలు మందకొడిగా ఉన్నాయి. క్వింటాలు పసుపు ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే పలికాయి. అయితే ఈఏడాది ఫిబ్రవరి నుంచి మార్కెట్‌లో కొంత కదలిక వచ్చింది. ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్‌లో మేలిమి రకం పసుపునకు రూ.7 వేలు దక్కుతుండగా మధ్యస్థ, తక్కువ నాణ్యత రకాలకు రూ.5వేల నుంచి రూ.6500 వరకు ధరలు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా సరకు లభ్యత తగ్గుముఖం పట్టడం, నాణ్యత కలిగిన మేలి రకం సరకు కొరత ఉంది. కరోనా నేపథ్యంలో పసుపు వాడకం కొంత ఆశాజనకంగా పుంజుకోవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. మే నెల తర్వాత ధరల్లో కాస్త పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి. మహారాష్ట్ర, నిజామాబాద్‌, సేలం మార్కెట్లలో పసుపునకు మంచి ధరలు లభిస్తున్నాయి. కర్కుమిన్‌ శాతం ఎక్కువగా ఉండే రకాలకు ఆదరణ లభిస్తోంది. దుగ్గిరాల మార్కెట్‌కు ఏటా 4లక్షల బస్తాల వరకు వస్తుండగా, ఈ సంవత్సరం 2.5 లక్షల బస్తాలు రావచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విఫణిలో మహారాష్ట్ర రాజాపురి, తమిళనాడు సేలం, నిజామాబాద్‌ రకాలకు గిరాకీ కొనసాగుతోంది. ఈరకాలు క్వింటాల్‌ రూ.10వేల కూడా పలుకుతున్నాయి. రైతులు ఈదిశగా అడుగులు వేస్తే తప్ప పసుపు పంట లాభదాయకంగా కనిపించే పరిస్థితులు లేవని చెబుతున్నారు. కర్కుమిన్‌ ఎక్కువ శాతం ఉన్న రకాలను కొందరు రైతులు సాగు చేస్తున్నారు. దీనిని మరింత విస్తరించడానికి ఉద్యానశాఖ ప్రయత్నిస్తోంది. ఇది విజయవంతమైతే రైతులకు ఆశించిన ధరలు లభించనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని