కేసులు తగ్గాయని...నిర్లక్ష్యం వద్దు...
logo
Published : 22/06/2021 04:13 IST

కేసులు తగ్గాయని...నిర్లక్ష్యం వద్దు...

ఈనాడు, అమరావతి  

స్పత్రుల వద్ద హడావుడి తగ్గింది.. పడకల కోసం ఆరాటం కనిపించడం లేదు.. ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్‌లు పెరిగాయి..  పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది.. ఇంటి వద్దనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితులతో కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తగ్గినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. కర్ఫ్యూ సడలించారు. జన సంచారం పెరిగింది. మార్కెట్లలో రద్దీ పెరిగింది. వర్తక వాణిజ్య సంస్థలను తెరుస్తున్నారు. సోమవారం నుంచి సాయంత్రం 6గంటల వరకు దుకాణాలు తెరుస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. సామాన్యుల జీవితం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తిగా క్రియారహితంగా మారలేదని వారు గుర్తు చేస్తున్నారు. కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షాకాలం కూడా కావడంతో పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని చెబుతున్నారు. ముందు మూడో దశ ఉంటుందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో మొత్తం 78 వరకు కొవిడ్‌ ఆస్పత్రులను గుర్తించారు. దాదాపు 6వేల పడకలు సిద్ధం చేశారు. వీటిలో 4వేల పడకల వరకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. అయినా పడకలు లభించక సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు. వెంటిలేటర్‌ సౌకర్యం లభించక కొంత మంది అసువులు బాశారు. ప్రస్తుతం చికిత్సకు సంబంధించి ఇబ్బందులు లేవు. పడకలు అందుబాటులో ఉన్నాయి.
అప్రమత్తత ముఖ్యం...
కరోనా ఉద్ధృతి తగ్గిపోయిందనే భావన ప్రజల్లో పనికిరాదని వైద్యులు సూచిస్తున్నారు. అప్రమత్తత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, నిత్యం చేతులు శుభ్రపరుచుకోవాలని, పరిసరాలను పరిభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్‌లకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అవసరమైతేనే మార్కెట్లకు వెళ్లాలి. మార్కెట్‌లలో చిరువ్యాపారులు తప్పనిసరిగా మాస్క్‌లు, చేతులకు తొడుగులు ధరించాలి.

ముందస్తు సన్నద్ధత 

- జె.నివాస్‌, కలెక్టర్‌
ఇంటింటికి జ్వర సర్వే ఈ నెల 22 నుంచి చేయిస్తున్నాం. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. మూడో దశ ఉంటే ఎలా ఎదుర్కోవాలి. ఏమేం కావాలనేదానిపై సమీక్ష చేస్తున్నాం. పిల్లల పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు, మందులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్లక్ష్యం తగదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ విభాగాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
-డాక్టర్‌ రవి, ఈఎన్‌టీ విభాగాధిపతి, జీజీహెచ్‌

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినా పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. జీజీహెచ్‌లో 140 మందికి శస్త్రచికిత్సలు చేశాం. 126 మంది చికిత్స పొందుతున్నారు. 30 మంది వరకు ఐసీయూలో ఉన్నారు. దురదృష్టవశాత్తు 8 మంది వరకు చనిపోయారు. కొంత ఆలస్యంగా గుర్తించిన వారికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. మూడో దశలోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదని చెప్పలేం. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

అందరికీ టీకా.. రక్ష
-డా.పీవీ రామారావు, పిల్లల వైద్య నిపుణులు

మూడో దశను ఎదుర్కొనేందుకు టీకానే రక్షణగా ఉంటుంది. ఈలోగా అందరికి టీకా వేయాలి. ప్రధానంగా పిల్లల తల్లులందరికీ టీకా పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడో దశలో ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన దగ్గర పిల్లల ఆస్పత్రులు, పిల్లల వైద్య నిపుణులు సరిపోయేంతగా లేరు. సిబ్బంది లేరు. వీటిని సమకూర్చుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని