వివాహమై ఆరు నెలలు.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
logo
Published : 22/06/2021 05:00 IST

వివాహమై ఆరు నెలలు.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కంచర్ల అరుణ (పాతచిత్రం)

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు పిడుగురాళ్ల మండలం చినఅగ్రహారానికి చెందిన కంచర్ల అరుణ (22) తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట కన్నుమూశారు. అనంతరం సత్తెనపల్లి వడ్డవల్లిలో ఆమె పెదనాన్న వద్ద ఉంది. దీపాలదిన్నెపాలేనికి చెందిన కంచర్ల సాగర్‌తో గత ఏడాది డిసెంబరు 21న వివాహం చేశారు. సోమవారం తెల్లవారుజామున అరుణ ఉరి వేసుకుని మృతి చెందిందని ఆమె సోదరి మేరికి సాగర్‌ ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. బంధువులు వచ్చే సరికి మృతదేహం మంచంపై ఉంది. మెడ చుట్టూ కమిలిన గాయాలు ఉన్నాయి. అరుణను భర్త హతమార్చి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై ఆవుల బాలకృష్ణ చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామంలో దగ్గరి బంధువైన ఒక మహిళతో సాగర్‌కు వివాహేతర సంబంధం ఉందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం అరుణ గమనించి భర్తను నిలదీయడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. వైఖరి మార్చుకోవాలని అతనికి పెద్దలు పలుమార్లు చెప్పారన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సాగర్‌, అతని బంధువులు కలిసి ఆమె మెడకు విద్యుత్తు తీగ బిగించి చంపి చున్నీతో వేలాడదీశారని ఆరోపించారు. ఉరి వేసుకుని చనిపోయినట్లు సోమవారం తెల్లవారుజామున చెప్పాడని తెలిపారు. పెళ్లయిన ఆరు నెలలకు ఆమె జీవితం కడతేరిందని ఆవేదన చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని