చట్ట ప్రకారం పనిచేస్తే గౌరవిస్తాం: చంద్రబాబు
eenadu telugu news
Published : 21/09/2021 02:55 IST

చట్ట ప్రకారం పనిచేస్తే గౌరవిస్తాం: చంద్రబాబు

కానూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. సోమవారం రాత్రి కానూరు టైమ్‌ ఆసుపత్రిలో దళిత ఐకాస నేత పులి చిన్నాను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తే గౌరవిస్తామని, అలాకాకుండా చట్టవ్యతిరేకంగా పనిచేస్తే శిక్షించే వరకు వదిలిపెట్టమన్నారు. వైకాపా నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తే వైకాపా పార్టీలో కార్యకర్తలే ఉండేవారు కాదన్నారు. ప్రజలను రక్షించేందుకు ఉన్నానన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు. ‘ప్రతిపక్షనేతగా ఉన్న మా ఇంటి వద్ద జరిగిన దాడిని పోలీసులు సమర్థిస్తారా.. ప్రతిపక్ష నేతలు మా ఇంటికి రావడం ఏమిటి? రౌడీలు దాడి చేయడం, ఆపై మా వారిపై కేసులు పెడతారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నోకష్టాలు పెట్టినా, శారీరకంగా, మానసికంగా హింసించినా మౌనంగా భరించామని, మారతారని చూస్తున్నామన్నారు. మారే పరిస్థితి కనిపించడం లేదని, తామే మార్చే పరిస్థితి వచ్చిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని, దళితులపై దాడులను ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాదు, శ్రావణకుమార్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నాయకులు వెలగపూడి శంకరబాబు, అనుమోలు ప్రభాకరావు, వీరంకి గురుమూర్తి, తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని