కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా

నిర్ణయం ప్రకటిస్తున్న ఎన్నికల అధికారి రామప్రసన్న

ఈనాడు- గుంటూరు, న్యూస్‌టుడే- దుగ్గిరాల: జిల్లాలో దుగ్గిరాల, పెదకూరపాడు మండల పరిషత్‌ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసినా కోరం లేక వాయిదా పడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసినా కోరం లేనందున రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నిక నిర్వహించడానికి తేదీ ప్రకటిస్తుంది. ఆరోజు ఎంత మంది సభ్యులు హాజరైనా కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహిస్తారు. పెదకూరపాడులో 14 ఎంపీటీసీ స్థానాలు అధికారపార్టీకి చెందిన అభ్యర్థులే కైవసం చేసుకున్నా పదవులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభ్యులు ప్రత్యేక సమావేశానికి ఒక్కరు కూడా హాజరుకాలేదు. దుగ్గిరాలలో మొత్తం 18 స్థానాలకు గాను తెదేపా 9, జనసేన 1, వైకాపా 8 దక్కించుకున్నాయి. తెదేపా ఎంపీపీ అభ్యర్థికి బీసీ కులధ్రువీకరణ పత్రం దరఖాస్తు చేస్తే తహశీల్దారు తిరస్కరించారు. దీంతో తెదేపా, జనసేన సభ్యులు సమావేశాలకు హాజరుకాలేదు. వైకాపాకు చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరైనా కోరం లేకపోవడంతో ప్రిసైడింగ్‌ అధికారి వాయిదా వేశారు. ఎన్నికల సంఘం తేదీ ప్రకటించిన రోజు పదవులకు ఎన్నిక జరగనుంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని ఎన్నికల అధికారి రామప్రసన్న తెలిపారు. ఎస్‌ఈసీ తేదీ నిర్ణయించాక కోరం మాట ఉండకపోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. తెదేపా ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, సమావేశాలకు ఎందుకు రాలేదో ప్రజలకు ఆ పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దుగ్గిరాల ఎంపీపీ పీఠాన్ని తమ పార్టీనే చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకటరావు అన్నారు. చిలువూరు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జబీన్‌ అనే ముస్లిం మహిళకు కుల ధ్రువీకరణ పత్రం రాకుండా ఎమ్మెల్యే ఆర్కే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని