నిర్బంధాలు.. అరెస్టులు
eenadu telugu news
Updated : 21/10/2021 03:43 IST

నిర్బంధాలు.. అరెస్టులు

ఈనాడు, అమరావతి

తెదేపా నేతల గృహ నిర్బంధాలు.. నిరసన ప్రదర్శనలు.. బలవంతంగా అరెస్టులు.. వైకాపా నేతల పోటీ నిరసన ప్రదర్శనలతో జిల్లాలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా నేతల నిరసనలపై కఠినంగా వ్యవహరించిన పోలీసులు.. వైకాపా నేతల నిరసన ప్రదర్శనలకు ఏమాత్రం అడ్డుచెప్పలేదనే విమర్శలు ఉన్నాయి. విజయవాడ ఒకటో పట్టణంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులు, దుర్గగుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆయన అనుచరులకు మధ్య పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. గొల్లపూడి, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం.. పలు ప్రాంతాల్లో తెదేపా నేతల అరెస్టుల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నేతలను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. విజయవాడ నగరం గొల్లపూడి చౌరస్తాలో తెదేపా నాయకులు ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు విఫలం చేశారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును గృహ నిర్బంధం చేయగా ఆయన పోలీసుల కళ్లు గప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి వై జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అరెస్టు చేసి అజిత్‌సింగ్‌నగర్‌కు తరలించారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఒకటో పట్టణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్నను గృహనిర్బంధం చేయగా నిరసన తెలిపేందుకు బయటకు వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించే క్రమంలో వైకాపా శ్రేణులు ఎదురుపడ్డాయి. పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో తెదేపా వ్యాఖ్యలకు నిరసన ప్రదర్శనలు చేస్తుండగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. జిల్లాలో తెదేపా నేతలను గృహనిర్బంధం చేయడంతో బంద్‌ పాక్షికంగా జరిగింది. అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ విజయవాడ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఆధ్వర్యంలో భారీగా ప్రదర్శన జరిగింది. వారి అరెస్టు ఉద్రిక్తతకు దారి తీసింది.ముఖ్య నాయకులను ముందుగానే గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ అనురాధను గృహ నిర్బంధం చేశారు.


వైకాపా నిరసన ప్రదర్శనలు

ఈనాడు, అమరావతి: పార్టీ పిలుపు మేరకు వైకాపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో నిరసన చేశారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో శిఖామణి సెంటర్‌లో వైకాపా నేత కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో దేవినేని అవినాష్‌ అనుచరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మధ్య నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మైలరవంలో, ఇబ్రహీంపట్నంలో నందిగామలో, జగ్గయ్యపేటలో నిరసన ప్రద్శనలు జరిగాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో కానూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. బందరులో, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ కైకలూరు, నూజివీడు, తిరువూరులలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని