‘మా వాళ్లను వదలిపెట్టండి’
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

‘మా వాళ్లను వదలిపెట్టండి’

స్టేషన్‌ ముందు రోదిస్తున్న నిందితుల బంధువులు

మడకశిర, న్యూస్‌టుడే: ‘గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో పోలీసులపై మా వాళ్లు దాడి చేయలేదని, వారిని కూడా రిమాండ్‌కు తరలిస్తున్నారని’ నిందితుల బంధువులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బోరున విలపించారు. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. నగర పంచాయతీ పరిధిలోని బేగార్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో పోలీసులపై పలువురు గ్రామస్థులు రాళ్లు రువ్వారని 15 మందిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా బుధవారం వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న నిందితుల తరఫు బంధువులు స్టేషన్‌ వద్దకు చేరుకుని నిమజ్జన కార్యక్రమంలో ముగ్గురు మాత్రమే రాళ్లు విసిరారని, అయితే పక్కనే ఉన్న తమ వాళ్లపైనా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని వాపోయారు. తమ వారిని విడుదల చేయాలని కోరుతూ ఆర్తనాదాలు చేశారు. గమనించిన సీఐ శ్రీరామ్‌ బాధితుల వద్దకు వెళ్లి సర్దిచెప్పి పంపించారు. అనంతరం సీఐని వివరణ కోరగా బేగార్లపల్లిలో గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ర్యాలీ జరుగుతుండగా సూర్యాస్తమయం కాక ముందే నిమజ్జనం చేయాలని పోలీసులు సూచించారన్నారు. కొందరు కేకలు వేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఏఎస్సై, ఇద్దరు హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారించి దాడికి పాల్పడిన 15 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని