ఎన్నాళ్లకెన్నాళ్లకు..
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్‌హెచ్‌-71 విస్తరణ పనులు ప్రారంభం


సువర్ణముఖి నదిలో జేసీబీల సాయంతో జరుగుతున్న పనులు

రేణిగుంట-నాయుడుపేట జాతీయ రహదారిపై మేర్లపాక సమీపంలో జరిగిన ప్రమాదమిది. ఈ మార్గంలో ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యం. ఇరుకైన రహదారి, వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. 2017లో ఏర్పేడు పోలీసుస్టేషన్‌ వద్ద గుమికూడిన జనంపైకి లారీ దూసుకెళ్లడంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ రహదారి విస్తరణకు ఎప్పుడో పచ్చజెండా ఊపినా.. పలు కారణాలతో పనులు జరగలేదు. తాజాగా గుత్తేదారు పనులు ప్రారంభించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

ఎన్‌హెచ్‌71 అంటే వాహన చోదకులకు దడ. ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు తెలిసిన వాళ్లు ఎంతో జాగ్రత్తగా వాహనాలు నడుపుతారు. తెలియని వారు వేగంగా వెళ్లడం, ముందు వెళ్లే వాహనాలను అధిగమించే క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. పాతికేళ్లుగా ఈ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరు వరుసల రహదారి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ప్రజలు, వాహన చోదకులు నిరీక్షించారు. ఈ క్రమంలోనే నాయుడుపేట-రేణిగుంట రహదారి పనులకు ఆమోదం లభించింది. పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినా ఇంతవరకు బాగానే ఉన్నా భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. నెల్లూరు జిల్లా పరిధిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ఎట్టకేలకు ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేయడంతో పనులు ప్రారంభించారు.

సువర్ణముఖి నదిలో పనులు

నాయుడుపేట-రేణిగుంట మార్గంలో శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో సువర్ణముఖి నదిపై వంతెన నిర్మించాల్సి ఉంది. నదిలో వంతెన పిల్లర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు, గుత్తేదారు ప్రణాళికలు సిద్ధం చేశారు. పనుల నిర్వహణకు వీలుగా సంబంధిత గుత్తేదారు సంస్థ శ్రీకాళహస్తిలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. వర్షాకాలం ముందుగానే నదిలో పిల్లర్లు వేసుకునేందుకు వీలుగా జేసీబీల సాయంతో పనులు ప్రారంభించింది. మరో రెండేళ్లలో ఆరు వరుసల రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశముందని రహదారుల విభాగం అధికారులు భావిస్తున్నారు.

రహదారి: రేణిగుంట-నాయుడుపేట (ఎన్‌హెచ్‌71)

మొత్తం దూరం: 53.4 కి.మీ.

నిరి్మతం కానున్నది: ఆరు వరుసలు

సేకరించిన భూమి: 251.59 హెక్టార్లు

అంచనా వ్యయం: రూ.1474 కోట్లు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని