మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వైకాపా శ్రేణుల యత్నం
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వైకాపా శ్రేణుల యత్నం


రామవరంలో సర్పంచి కాంతమ్మ, వైకాపా నాయకులతో మాట్లాడుతున్న ఎస్సై ఉమామహేశ్వరరావు

 

అనపర్తి: పెడపర్తి సర్పంచి నల్లమిల్లి కాంతమ్మ వైకాపా శ్రేణులతో కలిసి గురువారం అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిపైకి దాడికి ప్రయత్నించారు. ఇటీవల పోలీసులు గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ నెల 20న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిని 24 గంటల్లో నిరూపించకపోతే.. క్షమాపణ చెప్పాలని, లేకుంటే రామవరం వచ్చి తేల్చుకుంటానని కాంతమ్మ బుధవారం విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అందులోభాగంగా ఆమె పార్టీ శ్రేణులతో కలిసి రామవరం వచ్చారు. వారిని ఎస్సై ఉమా మహేశ్వరరావు, సిబ్బంది గ్రామ శివారులో ఆపి నచ్చజెప్పారు. అనంతరం వారంతా తిరిగి పెడపర్తి చేరుకున్నారు. పంచాయతీ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్పంచి కాంతమ్మ, ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడారు. కుతుకులూరు సర్పంచి గొల్లు హేమతులసి తదితరులు పాల్గొన్నారు. వివాదం నేపథ్యంలో పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రామవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఅవినీతిపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేయడమనే విష సంస్కృతికి వైకాపా తెరతీయడం దురదృష్టకరమన్నారు. రాజీనామా చేసి రండి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి సవాల్‌ విసిరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని