ఏటీఎంలే అడ్ఢా. అమాయకులకు టోకరా!
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

ఏటీఎంలే అడ్ఢా. అమాయకులకు టోకరా!


నిందితుడు రామారావు

 

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఎవరైనా డబ్బు డిపాజిట్‌ చేయడానికి వస్తే మాయమాటలతో గాలం వేస్తాడు.. తనకు నగదు అవసరం ఉందని, ఏటీఎంలో జమ చేయకుండా తనకిస్తే ఆన్‌లైన్‌ ద్వారా డిపాజిట్‌ చేస్తానని చెప్పి, నకిలీ సందేశం(మెస్సేజ్‌) పంపి ఉడాయిస్తాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్‌ రాము(27) బీటెక్‌ వరకు చదివి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని వేద లగ్జరీ బాయిస్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. భోలక్‌పూర్‌కు చెందిన జైత్వాల గౌతమ్‌ ఈ నెల 12న ఎస్సార్‌నగర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రూ.లక్ష డిపాజిట్‌ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న రామారావు.. తనకు నగదు అత్యవసరం ఉందని, నగదు తనకిస్తే వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపుతానని నమ్మబలికాడు. నమ్మిన గౌతమ్‌ అందుకు అంగీకరించాడు. నగదు తీసుకున్న రామారావు ఆన్‌లైన్‌ ద్వారా నగదు పంపినట్లు నకిలీ సందేశాన్ని గౌతమ్‌ ఫోన్‌కు పంపి అక్కడి నుంచి ఉడాయించాడు. నగదు జమ కాకపోగా, పంపిన సందేశం నకిలీదని గుర్తించిన బాధితుడు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇంటిపల్లి రామారావును అరెస్టు చేశారు. రూ.95వేల నగదు, చరవాణిని స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ సైదులు చెప్పారు. 2018-2019 మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా 27 కేసుల్లో రామారావు నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. 2019లో ఒకరిని మోసం చేసి నగదు కాజేసినందుకు ప్రయత్నించగా ఎస్సార్‌నగర్‌ పోలీసులు రామును అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తరువాత 5 సార్లు ఇలాంటి మోసాలకు పాల్పడి రూ.12,09,000 స్వాహా చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని