మోతలు ముడుపులు తప్పవా !
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

మోతలు ముడుపులు తప్పవా !

విద్యుత్తు నియంత్రిక మరమ్మతులకు కర్షకుని కష్టాలెన్నో!


మరమ్మతుకు గురైన విద్యుత్తు నియంత్రికను పొలాల నుంచి మోసుకొస్తున్న రైతులు

ఈనాడు, గుంటూరు : నియంత్రిక మరమ్మతుకు గురైతే విద్యుత్తుశాఖ వాహనంలో మరమ్మతు కేంద్రానికి తీసుకువచ్చి తిరిగి తీసుకెళ్లి అమర్చే బాధ్యత యంత్రాంగంపై ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. మరమ్మతు కేంద్రం నిర్వహిస్తున్న గుత్తేదారు విద్యుత్తు సిబ్బంది తెచ్చిన నియంత్రికను దించుకుని, మరమ్మతు చేసి, తిరిగి వాహనంలోకి ఎత్తినందుకు విద్యుత్తు శాఖ సొమ్ము చెల్లిస్తోంది. అయితే ఎత్తుడు, దించుడు కూలీల పేరుతో గుత్తేదారు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కర్షకులు గుత్తేదారు చెప్పినట్లు సొమ్ము చెల్లించి నియంత్రిక తీసుకెళుతున్నారు. ఇటీవల రైతు వద్ద సొమ్ము లేకపోతే ఆయన బంధువుల నుంచి గుత్తేదారుకు ఫోన్‌ ఫే చేసిన తర్వాతే నియంత్రిక ఇవ్వడం గుత్తేదారు దందాకు నిదర్శనంగా నిలిచింది. ఇది జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతంలో చోటుచేసుకోగా సంబంధిత రైతు ఫోన్‌ ఫే చేసిన స్క్రీన్‌ షాట్‌ను సామాజిక మాధ్యమంలో ఉంచడం చర్చనీయాంశమైంది.

రూ.15 వేల వరకు ఖర్చు

జిల్లాలో 1.50 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. డెల్టాలో లంక గ్రామాలు, తీరప్రాంతంలో వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలో ఉద్యాన పంటలు మొత్తం బోరుబావుల మీద ఆధారపడి సాగు జరుగుతోంది. ఇక్కడ వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా నరసరావుపేట డివిజన్‌లోని మాచర్ల, వినుకొండ సబ్‌డివిజన్ల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ విద్యుత్తు నియంత్రిక మరమ్మతుకు గురైతే రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో విఫలమైన నియంత్రికలు బాగుచేయడానికి 8 మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల వద్ద ఉన్న కేంద్రం విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో నడుస్తుండగా, మిగిలిన 7 కేంద్రాలు ప్రైవేటు గుత్తేదారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

వ్యవసాయ పంపుసెట్ల నిర్వహణకు అమర్చిన విద్యుత్తు నియంత్రికలు మరమ్మతుకు గురైతే రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు.. నియంత్రికను మోసుకెళ్లేందుకు స్వేదం చిందించాలి.. ఆపై జేబు గుల్ల చేసుకోవాల్సిందే.. విద్యుత్తు లేకపోతే మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతాయన్న అన్నదాతల ఆందోళనను ఆసరాగా చేసుకొని గుత్తేదారు అందినకాడికి దోచుకుంటున్నారు.

మోసుకొస్తేనే పని జరిగేది

విద్యుత్తు నియంత్రిక మరమ్మతు కేంద్రానికి వచ్చిన తర్వాత దించుకుని స్వల్ప మరమ్మతు అయితే వెంటనే చేసి రైతులకు అప్పగించాలి. వెంటనే బాగు చేసే పరిస్థితి లేకపోతే మరో నియంత్రిక ఇచ్చి పంపాలి. ఈ మొత్తం ప్రక్రియకు విద్యుత్తుశాఖ గుత్తేదారుకు సొమ్ము చెల్లిస్తుంది. పౌరసేవల పట్టిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల వ్యవధిలో నియంత్రికలు బాగు చేసి అమర్చాలి. ఈక్రమంలో ప్రత్యామ్నాయంగా సమీప నియంత్రికల నుంచి విద్యుత్తు సరఫరా ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించిన నియంత్రిక విఫలమైన వెంటనే రైతులు విద్యుత్తుశాఖ సిబ్బందికి చెబితే వాహనం అందుబాటులో లేదని సమయం పడుతుందని చెప్పి మీరే తెచ్చుకుంటే తొందరగా మరమ్మతు చేసి అమర్చుతామని చెబుతున్నారు. దీంతో రైతులు చేసేదిలేక సొంత వాహనాలు అందుబాటులో ఉంటే వాటి ద్వారా లేనిపక్షంలో అద్దె వాహనాల్లో మరమ్మతు కేంద్రానికి తీసుకువస్తున్నారు. కేంద్రానికి తెచ్చిన తర్వాత గుత్తేదారు రైతుల నుంచి ఎత్తుడు, దించుడు కూలీ పేరుతో సొమ్ము వసూలుచేస్తున్నారు. రూ.1000 నుంచి రూ.5వేల వరకు రైతుల అవసరాన్ని అనుసరించి డిమాండ్‌ చేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి చెందిన రైతు ఒకరు ఇక్కడ ఎకరం భూమి కౌలుకు రూ.15వేలు చెల్లిస్తున్నామని, నియంత్రిక విఫలమవడం ద్వారా ఏడాదికాలంలో రూ.15వేల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నామని వాపోయారు.

 

అప్పుల పాలు అవుతున్న అన్నదాతలు

పల్నాడులో హెచ్‌వీడీఎస్‌ విధానం అమలుతో 25కేవీ, 16కేవీ నియంత్రికలు ఎక్కువగా ఉన్నాయి. వీటి పరిధిలో రెండు నుంచి ఐదు పంపుసెట్లు మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కువగా విఫలం కావడంతో సంబంధిత రైతులకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. రైతులకు అవగాహన లేకపోవడంతో గుత్తేదారుతోపాటు సిబ్బంది కొందరు అందినకాడికి దోచుకుంటున్నారు. పంట ఎండిపోతుందన్న ఆందోళనలో అన్నదాతలు అప్పులు తెచ్చి మరీ సొమ్ము చెల్లిస్తున్నారు. ఇటీవల కొల్లిపర మండలం అత్తోటలో విద్యుత్తు నియంత్రిక విఫలమైతే రైతులే పొలాల వెంబడి మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని