Published : 04/03/2021 02:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాహ్య విలయం

వేగ పరిమితి తగ్గించినా రక్తమోడుతున్న ఓఆర్‌ఆర్‌

మరమ్మతులకు నోచుకోని రెయిలింగ్‌

భాగ్యనగరానికే తలమానికమైన బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై వేగ పరిమితి తగ్గించినా నిత్యం ఎక్కడోచోట రక్తమోడుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంక్షలు విధించినా గతేడాది అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు లెక్క తేల్చారు. అతివేగం, వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించడంతోపాటు నిర్వహణ లోపాలు కూడా కారణమేనని ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.

120 కి.మీల నుంచి 100 కి.మీలకు...

158 కి.మీల ఓఆర్‌ఆర్‌ను గంటకు 120 కి.మీల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్‌ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గతంలో వేగ పరిమితిని 100 కి.మీలకు తగ్గించారు. అయినా.. క్షేత్రస్థాయిలో ఫలితంగా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌లో ఓఆర్‌ఆర్‌పై కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. అంటే.. ఈ లెక్కన చూస్తే గతంతో పోలిస్తే గతేడాది ప్రమాదాల సంఖ్య తగ్గాలి. కాకపోతే.. పరిస్థితి భిన్నంగా ఉంది. అవుటర్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 2018లో 104 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 2019లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2020కి వచ్చేసరికి 148 ప్రమాదాల్లో 48 మరణించగా.. 149 మంది క్షతగాత్రులయ్యారు.

 

గుంతలమయం.. ఎగుడు దిగుడు..


గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో గుంతలను తారుతో నింపి మమ అనిపించిన అధికారులు

ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌లు, మెయిన్‌ క్యారేజ్‌ వే తదితర చోట్ల హెచ్‌ఎండీఏ సుందరీకరణ పనుల్ని చేపడుతోంది. అయితే.. ప్రధాన రహదారి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ఎక్కడికక్కడ గుంతలు వాహనదారులకు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని చోట్లనేమో వాటిపై తారు పోసి చేతులు దులుపుకొన్నారు. అలాంటి ప్రాంతాల్లో సాఫీగా సాగాల్సిన ప్రయాణం ఎగుడు దిగుడుగా మారింది. గాల్లో దూసుకొచ్చే వాహనాలు కుదుపునకు గురై ఒక్కసారిగా అదుపు తప్పుతున్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు గల ప్రధాన రహదారిపై ఈ సమస్య అధికంగా ఉంది. మరికొన్ని చోట్ల గుంతలను అలాగే వదిలేశారు. రోడ్లకిరువైపులా ఉండే రెయిలింగ్‌(రక్షణ ఛత్రం)ను వాహనాలు ఢీకొట్టడంతో కొన్ని చోట్ల విరిగిపోయాయి. వాటికి కనీసం మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు సీఆర్‌ఆర్‌ఐ సూచనల్ని అమలు చేసిన దాఖలాలు లేవు.

సీఆర్‌ఆర్‌ఐ ఏం చెప్పింది...

మూడేళ్ల కిందట దిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) ఓఆర్‌ఆర్‌ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అధ్యయనం చేసింది. 30 నుంచి 50 శాతం కార్లు, 7 శాతం లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌, 1 శాతం భారీ ట్రక్కులు నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువ వేగంతో గాల్లో దూసుకెళ్తున్నట్లు తేల్చారు. ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశమున్న 29 ప్రాంతాలను గుర్తించింది. వేగానికి కళ్లెం వేసేలా కర్వ్‌లు, గ్రాండెంట్‌ సెక్షన్లు, ట్రాన్స్‌వర్స్‌ బార్‌ మార్కింగ్‌, మీడియన్‌ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్‌ మార్క్‌లు, స్పీడ్‌ అరెస్టర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. పైనుంచి వాహనాలు కింద పడకుండా ‘టిపికల్‌ డబుల్‌ మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌’ను తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. మార్కింగ్స్‌, హెచ్చరికలు రాత్రిపూట కనిపించేలా ఏర్పాట్లు చేయాలని, ఓఆర్‌ఆర్‌ నిర్వహణపై కూడా దృష్టి సారించాలని స్పష్టం చేసింది.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని