ట్రాక్టర్‌ బోల్తా.. యువకుడి మృత్యువాత
eenadu telugu news
Published : 02/08/2021 01:40 IST

ట్రాక్టర్‌ బోల్తా.. యువకుడి మృత్యువాత

సమ్మప్ప

అంతారం(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్న యువకుడు కొద్దిసేపట్లో విధులకు వెళ్లాల్సి ఉండగా పొలంలో కూరుకుపోయిన ట్రాక్టర్‌ తీసేందుకు వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. అంతారం వాసి స్వామిదాస్‌ అదే గ్రామానికి చెందిన మహేందర్‌ను చోదకుడిగా నియమించి ట్రాక్టర్‌తో పొలం పనులు చేయిస్తున్నాడు. స్థానికుడు దస్తప్ప పొలంలో శనివారం దమ్ము చేస్తుండగా ట్రాక్టర్‌ వెనక చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకపోవడంతో ట్రాక్టర్‌ను పొలంలోనే ఉంచి విషయాన్ని యజమానికి తెలిపాడు. స్వామిదాస్‌ కుమారుడు సమ్మప్ప(21) ఆదివారం ఉదయం పొలానికి చేరుకొని ట్రాక్టర్‌ను బురదలోంచి ముందుకు పోనిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ క్రమంలో అతడు ట్రాక్టర్‌కింద పడగా బురదలో కూరుకుపోయాడు. స్థానికులు గమనించి సమ్మప్పను బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని