ఇప్పుడెలా.. ఆగండి మరో నెల!
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

ఇప్పుడెలా.. ఆగండి మరో నెల!

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఆన్‌లైన్‌ తరగతులూ ఆపేస్తామంటున్న యాజమాన్యాలు

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. లక్షలమంది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం (ఈనెల 27) నుంచి ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ప్రతి విద్యార్థి పాఠశాలలకు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేశాయి. ఆన్‌లైన్‌ క్లాసులను బంద్‌ చేస్తున్నామని చాలా పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ వరకు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మరో నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించి తరువాత బంద్‌ చేసినా పర్వాలేదని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. 

బస్సులు నడపలేం.. మూడు రోజుల నుంచి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి సోమవారం నుంచి తప్పనిసరిగా పిల్లలను బడికి పంపించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులనూ నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు.  కొంతమంది తల్లిదండ్రులు మాత్రం స్కూలు బస్సులు తిరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతుండగా.. ఇప్పట్లో బస్సులను నడపలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.  ‘పంపుదామంటే స్కూలు, కాలేజీ బస్సులు తిరగడం లేదు అని, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదని హైదరాబాద్‌కు చెందిన గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఎంతోమంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని