నగరానికి ‘గులాబ్‌’ గుబులు!
eenadu telugu news
Published : 27/09/2021 03:24 IST

నగరానికి ‘గులాబ్‌’ గుబులు!

నేటి నుంచి మూడురోజులు భారీ వర్ష సూచన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను గుబులు నగరంలోనూ మొదలైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సోమవారం నుంచి మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈమేరకు ఆదివారం రాత్రి పౌరులు, సిబ్బందికి ఉన్నతాధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. పౌరులు తప్పనిసరి అయితే తప్ప బయటికి రావొద్దని కోరారు. బల్దియా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. గతేడాది వానాకాలంలో ఇబ్బందులు ఎదురైన చోట ముందుగానే డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆదేశాలిచ్చారు. ఈ వారంరోజుల పాటు ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముంపు ప్రాంతాల నుంచి బాధితుల్ని తరలించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ముంపు ప్రమాదమున్న ప్రాంతాలవాసులను ముందుగానే హెచ్చరించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.


040- 2320 2813 - కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

నాంపల్లి: బంగాళాఖాతంలో అల్పపీడనం, గులాబ్‌ తుపాన్‌ కారణంగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టరేట్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ఇద్దరు అధికారులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని