తుక్కు ఇనుము తరలింపు.. బందెల దొడ్డి కూల్చివేత
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

తుక్కు ఇనుము తరలింపు.. బందెల దొడ్డి కూల్చివేత

నగరపాలికలో అక్రమాల దుమారం

ప్రతిపక్షాల ఫిర్యాదుల వెల్లువ

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం


నగరపాలక కార్యాలయం వెనకాల తుక్కు ఇనుము

తుక్కు ఇనుము అక్రమ తరలింపు.. బందెల దొడ్డి కూల్చివేత అంశాలు నాలుగు రోజులుగా రామగుండం నగరపాలికలో దుమారం లేపుతున్నాయి. నగరపాలికలోని కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండగా దానికి అధికారులు సహకరించారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా తుక్కు ఇనుమును వేలం వేసి విక్రయించాల్సి ఉండగా అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న అధికారులు ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో అందులో అధికారుల పాత్ర సైతం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీనిపై నగరంలోని వివిధ వర్గాలతో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడంతో పాటు జిల్లా పాలనాధికారికి, పురపాలక మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా నగరపాలకవర్గం, అధికారుల్లో చలనం రావడం లేదు. ఇదే తరహాలో నగరపాలిక అనుమతి లేకుండా పురపాలక పాత కార్యాలయం సమీపంలోని బందెల దొడ్డిని కూల్చివేయడంతో పాటు దాని బండరాళ్లు, ఇనుప గేట్లను అక్రమంగా తరలించారు. కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని వాహనాల పార్కింగ్‌ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయమే తమ దృష్టికి రాలేదంటూ దాటవేస్తున్నారు. జనగామ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటివరకు చెడిపోయిన ట్యాంకర్లు, ట్రాక్టర్ల విడిభాగాలు, ఆటో ట్రాలీలు, సైకిల్‌ రిక్షాలు ఇలా అనేక రకాల వాహనాలు నగరపాలక పాత కార్యాలయం వెనకాల ఉండేవి. బహుళ ప్రయోజనకర భవనం నిర్మాణం కోసం పాత భవనంతో పాటు పక్కనున్న రేకుల షెడ్లను కూల్చేశారు. దీనికి సంబంధించిన తుక్కు ఇనుముతో పాటు రేకులు, తదితర సామగ్రిని సైతం అక్కడే భద్రపరిచారు. ఇదంతా సుమారు రెండు లారీల్లో కొందరు అక్రమంగా తరలించారు. దీని విలువ సుమారు రూ.50 లక్షలకు పైగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు గురువారం జిల్లా పాలనాధికారికి, స్థానిక సంస్థలను పర్యవేక్షించే అదనపు పాలనాధికారికి ఫిర్యాదు చేయడం గమనార్హం.


ఆది నుంచి ఇదే వ్యవహారం

తుక్కు ఇనుము తరలింపు విషయంలో ఆది నుంచి నగరపాలిక ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం నగరపాలక కూరగాయల మార్కెట్‌ను కూల్చేసి దాని స్థానంలో కొత్తగా మార్కెట్‌ నిర్మాణం చేపట్టినప్పుడు తుక్కు ఇనుమునంతా నగరపాలక కొత్త కార్యాలయం ఆవరణలో ఉంచారు. నగరపాలక కార్యాలయం, మార్కెట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నాడంటూ తుక్కు ఇనుమును కొందరు గుత్తేదార్లు అక్రమంగా తరలించారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరగా మిగిలిన తుక్కు ఇనుమును వదిలేశారు. నగరపాలక కార్యాలయ ఆవరణలోని ట్రాక్టర్ల బ్యాటరీలు, విద్యుత్తు మోటార్లు చోరీకి గురవుతున్నాయి. నగరపాలక కార్యాలయ భవనంలోపల లిఫ్టునకు సంబంధించిన మోటారు సైతం గతంలో చోరీకి గురయింది. ఇదంతా జరుగుతున్నా దీనిపై ఎన్నడూ విచారణ చేపట్టని అధికారులు, పాలకవర్గం పోలీసులకు ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవు. నగరపాలక కార్యాలయ ఆవరణలో చెడిపోయిన డంపర్‌ ప్లేసర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, స్కై లిఫ్టర్లు, డంపర్‌ బిన్స్‌ ఇలా పెద్ద మొత్తంలో తుక్కు ఇనుము ఉంది. పాలకవర్గం, అధికారులు ఇలాగే వదిలేస్తే కొద్ది రోజుల్లో ఇదంతా అక్రమార్కుల పాలయ్యే అవకాశముందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై పశువుల సంచారాన్ని నివారించాలనే లక్ష్యంతో జనగామ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన బందెల దొడ్డిని నాటి గుర్తుగా ఉంచుకుంటూ ఉపయోగంలోకి తేవాల్సి ఉండగా దానిని అక్రమంగా కూల్చేయడం గమనార్హం. ఇప్పటికైనా బందెల దొడ్డి స్థలాన్ని నగరపాలిక స్వాదీనం చేసుకొని పిల్లల క్రీడా వస్తువులను ఏర్పాటుచేస్తే పరిసర ప్రాంతవాసులకు ఉపయోగంలోకి రానుంది.


విచారణకు ఆదేశించాం

- డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, నగర మేయర్‌

తుక్కు ఇనుము తరలింపుపై విచారణకు నగరపాలక ఏఈ మహేందర్‌కు బాధ్యతలు అప్పగించాం. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఇందులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బందెల దొడ్డి కూల్చేసిన విషయం నా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని